కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం

గువహటి : కరోనా మహమ్మారి నివారణకు కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. ఈ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నిల్వ ఉంచిన 1,000 కొవిషీల్డ్ డోసులు గడ్డ కట్టాయి. ఈ వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాలి. కానీ ఈ మెడికల్ కాలేజీలో టీకాలు నిల్వ ఉంచిన ప్రదేశంలో ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి వెళ్లిపోవడంతో గడ్డ కట్టినట్లు తేలింది. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్(ఐఎల్ఆర్)లో సాంకేతిక సమస్యల కారణంగానే టీకాలు గడ్డ కట్టాయని అధికారులు తెలిపారు. అయితే ఐఎల్ఆర్ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఉంచుతాం. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలో మైనస్‌లోకి వెళ్లిపోతాయో.. తమకు వెంటనే సందేశం వస్తుంది. కానీ ఈ సారి అలాంటి మేసేజ్ రాకపోవడంతో గమనించలేకపోయామని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో వెయ్యి డోసులను అసోం ఆరోగ్య శాఖ సిల్చార్ మెడికల్ కాలేజీకి పంపింది.