ప్రజల కన్నీళ్లు తుడుద్దామనుకున్నా : యడ్డీ

Sat,May 19, 2018 03:56 PM

Yeddyurappa addresses Assembly thanks people for trusting BJP with their vote

బెంగళూరు : కర్ణాటక విధానసౌధలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం యడ్యూరప్ప ఆవేదనపూరిత ప్రసంగం చేశారు. ప్రజల కన్నీళ్లు తుడుద్దామనుకున్నాని ఆవేదన చెందారు యడ్డీ. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు అని చెప్పారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు యడ్యూరప్ప.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేశామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ప్రజలు తమను 104 స్థానాల్లో గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయాయని గుర్తు చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన మమ్మల్ని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్, జేడీఎస్ తెరచాటు రాజకీయాలను ఖండిస్తున్నానని యడ్యూరప్ప చెప్పారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ను కర్నాటక ప్రజలు తిరస్కరించారని యడ్యూరప్ప పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను వాళ్ల కళ్లలో చూశాను అని ఆవేదనపూరిత ప్రసంగం చేశారు యడ్డీ. ప్రజలు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను మరువలేను. రాష్ర్టంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశాను. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లు అయినా తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని యడ్డీ తెలిపారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు రైతుల బాగు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాను అని యడ్యూరప్ప స్పష్టం చేశారు.

2242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles