
ప్రపంచంలోనే అత్యంత పొడవైన టవర్ ఏదంటే టక్కున బుర్జ్ ఖలిఫా అని చెప్పేస్తారు కదా. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ 829.8 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే 2722 ఫీట్లు అన్నమాట. మరి.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కప్కేకుల టవర్‌ను చూశారా ఎప్పుడైనా? కప్‌కేకులతో టవర్లు కూడా కడతారా అని ఆశ్చర్యపోకండి. గిన్నిస్ రికార్డు కోసం తయారు చేసిన టవర్ అంది. 18,818 కప్పులతో 41 ఫీట్ల 8 ఇంచుల పొడవైన టవర్‌ను నిర్మించారు చెన్నైకి చెందిన ప్రీతి కిచెన్ అప్లయెన్సెస్ అండ్ ఫుడ్ కాన్సులేట్ సిబ్బంది. పిరమిడ్ ఆకారంలో నిర్మించిన ఈ కప్‌కేక్ టవర్ కోసం అక్కడికక్కడే కప్‌కేక్‌లను తయారు చేశారట. ఓవైపు టవర్ నిర్మిస్తూనే అక్కడే కప్కేకులను తయారు చేసి దానికి ఓ ఆకారాన్ని తీసుకురావడానికి కనీసం 30 గంటలు పట్టిందట. దీన్ని చెన్నైలోని ఫోరమ్ విజయా మాల్లో నిర్మించి సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచారు.
ఒక్కో కప్కేకు 70 గ్రాముల బరువు ఉంటుందట. అంటే అన్ని కప్కేకుల బరువు కలిపితే మొత్తం 1.3 టన్నుల బరువు ఉందంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. టవర్ కొలతలు తీసుకున్న అనంతరం దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించి.. తర్వాత ఆ కప్కేకులను చెన్నైలోని అనాథ పిల్లలకు పంచిపెట్టారు.