లక్ష్యం పూర్తయింది.. దేశంలోని ప్రతి ఊరికీ కరెంట్!

Mon,April 30, 2018 01:18 PM

With Leisang village in Manipur gets electricity Government says Mission accomplished

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ ఇవ్వాలన్న తమ లక్ష్యం నెరవేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌లోని లీసాంగ్ అనే గ్రామంలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం ఈ ప్రకటన చేసింది. మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని లీసాంగ్ అనే ఈ ఊళ్లో 19 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడీ ఊరు దేశంలో కరెంటు వసతి ఉన్న మొత్తం 5.97 లక్షల గ్రామాలలాగే నేషనల్ గ్రిడ్‌కు కనెక్టయింది. రూ.76 వేల కోట్లతో ప్రతి గ్రామానికీ కరెంటు ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన సమయంలో దేశంలో 18,452 ఊళ్లకు కరెంటు వసతి లేనట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ జాబితాకు మరో 1275 గ్రామాలను చేర్చారు. ఇప్పుడీ ఊళ్లన్నింటికీ కరెంటు వసతి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మొత్తం 5,97,463 గ్రామాలు ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెల్లడించాయి. చివరి గ్రామమైన లీసాంగ్‌కు కరెంటు వసతి కల్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


ప్రతి ఊరికీ కరెంటు వసతి ఉన్నదని ప్రభుత్వం చెబుతున్నా.. దేశంలో ఇప్పటికీ 17.99 కోట్ల గ్రామీణ గృహాల్లో విద్యుత్ వెలుగులకు దూరంగా ఉన్నాయి. జార్ఖండ్‌లో అత్యధికంగా 52.25 శాతం ఇళ్లకు కరెంటు వసతే లేదు. ఒక ఊరిలో ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ సరఫరా చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తే చాలు ఆ గ్రామం కరెంటు వసతి ఉన్న లిస్ట్‌లో చేరిపోతుంది. నిబంధనల ప్రకారం ఆ గ్రామంలోని కనీసం పది శాతం ఇళ్లకైనా ఆ వ్యవస్థ ద్వారా కరెంటు పొందాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ అన్న నిబంధన లేకపోవడంతో ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ఇళ్లు కరెంటుకు దూరంగానే ఉన్నాయి. మిగిలిపోయిన అన్ని ఇళ్లకూ వచ్చే ఏడాది మార్చి 31లోపు కరెంటు వసతి కల్పిస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

1975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles