బీజేపీకి వీహెచ్‌పీ భారీ షాక్!

Sun,January 20, 2019 12:59 PM

లక్నో: బీజేపీకి పెద్ద షాకిచ్చే ప్రకటన చేసింది విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ). ఒకవేళ రామమందిర నిర్మాణాన్ని తన మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని వీహెచ్‌పీ స్పష్టం చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాకు అన్ని దారులు మూసేసింది. కానీ వాళ్లు ఆ దారులు తెరిచి రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం అని అలోక్ స్పష్టం చేశారు. రామ మందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.


ధర్మ సన్సద్‌లో మఠాధిపతులు, సన్యాసుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం. రామ మందిర అంశాన్ని కూడా వాళ్ల దగ్గర ప్రస్తావించి వాళ్ల సలహా కోరతాం. ఆ తర్వాతే ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం అని అలోక్ చెప్పారు. ఒకవేళ పార్లమెంట్‌లో రామ మందిరంపై బిల్లు తీసుకొస్తే మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కలిసి కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని తాము భావిస్తున్నట్లు అలోక్ చెప్పారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ అంశాన్ని పెట్టాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. ముందు రామున్ని కాంగ్రెస్ వాళ్ల గుండెల్లో పెట్టుకోనివ్వండి. ఇదే పార్టీకి చెందిన కపిల్ సిబల్ ఈ అంశంపై ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కోర్టుని కోరారు. మా వరకు రామ మందిరానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

3659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles