బ్రిటిష్ జమానా రైలింజన్‌కు ముసుగెందుకు వేసినట్టో?

Fri,March 15, 2019 04:20 PM

Why the British era railway engine covered under a curtain

బారామతి మహారాష్ర్టలోని ఓ పట్టణం. ఆ పట్టణంలో బ్రిటిష్ జమానాకు చెందిన ఓ ఆవిరి రైలింజనును స్మృతిచిహ్నంగా ఓ గద్దె మీద నిలబెట్టారు. కానీ ఎన్నికల నగారా మోగగానే దాని మీద అధికారులు ముసుగు కప్పారు. నిబంధనల ప్రకారం ఏ పార్టీ గుర్తును పబ్లిక్‌స్థలాల్లో ప్రదర్శించరాదు. శివసేన నుంచి విడివడి సొంతకుంపటి ఏర్పాటు చేసుకన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ఎన్నికల గుర్తు రైలింజను. అందుకే అధికారులు ముసుగు వేశారని తెలిసింది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే బారామతిలో ఎంఎన్‌ఎస్ పోటీ చేయడం లేదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీచేస్తుందో లేదో కూడా తెలియదు. బారామతిలో అంటే ఎన్సీపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ సుప్రీమో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కూటమి కట్టాల్సిందిగా ఎన్సీపీ పంపిన ఆహ్వానాన్ని ఎంఎన్‌ఎస్ తిరస్కరించింది. ఆ పార్టీకి మిగిలిన ఒక ఎమ్మెల్యే ఇటీవల గుడ్‌బై కొట్టి శివసేనలో చేరిపోయారు. కానీ అధికారులు మాత్రం రూలు రూలే అంటున్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా మా మీదకే వస్తుంది అని ఓ అధికారి చెప్పారు. అందుకే రైలింజనుకు ముసుగేసి చేతులు దులిపేసుకున్నారు. యూపీలోనూ ఈ సమస్య ఉంది. మాజీ సీఎం మాయావతి నిర్మించిన దలితమూర్తుల పార్కులో బోలెడు పెద్దపెద్ద ఏనుగుల బొమ్మలుంటాయి.

ఏనుగు ఆమె బీఎస్పీ ఎన్నికల గుర్తు అనేది తెలిసిందే. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్కులోని ఏనుగులకు అధికారులు ముసుగులు కప్పుతారు. ఈ తంతు అలా కొనసాగుతూనే ఉంది. ఏనుగు బొమ్మకైతే ముసుగు వేస్తున్నారు. కానీ ఏనుగుకు ముసుగు వేయలేరు కదా. ఆటో, కారు, సైకిల్ వంటి ఎన్నికల గుర్తులు కూడా ఉన్నాయి. ఇక హస్తం సంగతి సరేసరి. మరి అన్నిటికి ముసుగేయడం సాధ్యమవుతుందా? పోటీ చేయని ఎంఎన్‌ఎస్ గుర్తు అయిన రైలింజనుకు ముసుగేయించిన ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై నెటిజనులు జోకులు వేస్తున్నారు.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles