మిరాజ్ ఫైటర్ జెట్స్‌నే ఎందుకు వాడారో తెలుసా?

Tue,February 26, 2019 01:02 PM

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భీకర దాడి చేసిన సంగతి తెలుసు కదా. మంగళవారం తెల్లవారుఝామున జరిగిన ఈ దాడిలో వందల మంది ఉగ్రవాదులు మృత్యువాత పడినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దాడిలో 12 మిరాజ్-2000 ఫైటర్ జెట్స్ పాలుపంచుకున్నాయి. సుమారు వెయ్యి కిలోల బాంబులను స్థావరాలపై జార విడిచాయి. అయితే అసలు ఈ దాడికి మిరాజ్ ఫైటర్ జెట్స్‌నే ఎందుకు వాడారన్నదాని వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. నిజానికి కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి కూడా ఈ మిరాజ్ ఫైటర్ జెట్స్ కీలక పాత్ర పోషించాయి. 1970ల్లో ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ఈ తక్కువ బరువు ఉన్న మిరాజ్-2000 ఫైటర్ జెట్స్‌ను తొలిసారి తయారు చేసింది. అమెరికా నుంచి పాకిస్థాన్ ఎఫ్-16లు కొనుగోలు చేయడంతో దానికి కౌంటర్‌గా ఇండియా ఈ మిరాజ్‌లను కొనుగోలు చేసింది. ఈ మిరాజ్ కోసం వెయ్యి కిలోల లేజర్ గైడెడ్ బాంబులను కూడా భారత్ కొనడం విశేషం. ఐఏఎఫ్ దీనికి వజ్ర అనే పేరు పెట్టింది.


1985లో తొలిసారి ఏడు మిరాజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇండియాకు వచ్చాయి. అప్పటి నుంచీ ఐఏఎఫ్ అమ్ములపొదిలో ఈ మిరాజ్‌లు మంచి విశ్వసనీయ ఫైటర్ జెట్స్‌గా పేరుగాంచాయి. కార్గిల్ యుద్ధంలోనూ ఈ మిరాజ్‌లు కీలకపాత్ర పోషించాయి. ఈ విమానాలు అత్యధిక ఎత్తుల్లో కూడా ఎగరగలవు. లేజర్ గైడెడ్ బాంబుల సాయంతో లక్ష్యాలను ఛేదించగలవు. అంతేకాదు అత్యంత కచ్చితత్వంతో ఇవి లక్ష్యాలను ధ్వంసం చేయగలవు అని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) మాజీ ఎండీ అశోక్ సక్సేనా చెప్పారు. ఇలాంటి దాడుల కోసం ముందుగానే శాటిలైట్లు, డ్రోన్ల సాయంతో లక్ష్యాలను ఎంచుకుంటారని ఆయన వెల్లడించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత దానిని కచ్చితత్వంతో మిరాజ్ ధ్వంసం చేయగలదు. అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఈ మిరాజ్‌లు ప్రముఖ పాత్ర పోషించాయి. వీటి సాయంతోనే 5000 మీటర్ల ఎత్తులో టైగర్ హిల్‌పై ఉన్న పాకిస్థాన్ లక్ష్యాలను ఇండియా ఛేదించగలిగింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర 50 మిరాజ్ 2000లు ఉన్నాయి.

9784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles