అవినీతిని ఉపేక్షించం : ప్రధాని మోదీ

Wed,August 15, 2018 09:00 AM

We will not spare the corrupt says prime minister Narendra Modi

న్యూఢిల్లీ : దేశంలో అవినీతిని ఉపేక్షించమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం అని చెప్పారు. పౌరసరఫరా శాఖలో అవకతవకలను అరికట్టి రూ. 90 వేల కోట్లు ఆదా చేశామని గుర్తు చేశారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. పన్నుదారుల సొమ్మును మంచి పనులకే ఉపయోగిస్తాం. నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుందన్నారు మోదీ. ఇంతకంటే మానవసేవ ఏముంటుందని? మోదీ ప్రశ్నించారు. అవినీతి రహిత భారత్ కోసం పౌరులంతా సహకరిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో పవర్ బ్రోకర్ల ఆనవాళ్లు లేకుండా చేయగలిగాం. పైరవీకారులు ఎలా ఉంటారో ఢిల్లీలో కనబడకుండా చేశాం. అవినీతి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చర్యలు చేపడుతున్నామని మోదీ చెప్పారు. అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇది భారతీయ మహిళల శక్తికి నిదర్శనమని మోదీ చెప్పారు. స్వల్పకాల సర్వీస్ కమాండ్‌లో పని చేస్తున్న మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించామన్నారు. క్రీడల నుంచి పార్లమెంట్ దాకా మహిళలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. మహిళలపై నేరాలు చేసే రాక్షస శక్తులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌తో ఎంతో మంది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలను రక్షించేందుకు బిల్లు తీసుకువస్తున్నామని మోదీ తెలిపారు.

నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది : మోదీ


నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తుంది.. ఇవాళ దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నాం. అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నాం. స్వప్పాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు. పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో సామాజిక న్యాయం సాధించాం.. ఓబీసీ కమిషన్ బిల్లును ఆమోదించాం.

దేశం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నా. దేశంలో వర్షాలు పడుతున్నాయన్న శుభవార్త ఒకవైపు ఉంది. మరోవైపు వరదలు వస్తున్నాయన్న బాధ కలుగుతోంది. ఎన్నో సవాళ్లు, అడ్డంకులను అధిగమించాం. అందరికీ న్యాయం, అందరూ అభివృద్ధి పథంలో ముందకు సాగాలి. దేశమంతటా విద్యుత్ వెలుగులు నింపాం. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం. ఇండియన్ నేవీలో ఆరుగురు మహిళలు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా.

ప్రతీ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యం సాకారమవుతోంది. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న స్వప్నాన్ని నాలుగేళ్లలో సాకారం చేశాం. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించాలన్నదే లక్ష్యం. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు నెరవేరుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా మాదిరిగా పని చేస్తున్నాయి. కొత్త ఐఐటీ, ఐఐఎంలు సహా అనేక విద్యా సంస్థలకు రూపకల్పన జరుగుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం అత్యంత వేగంగా సాగుతోంది. గొప్ప గొప్ప నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సూక్ష్మ బిందు సేద్యంతో వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించిన తమ ప్రభుత్వానిదే. రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు.

జీఎస్టీ తీసుకువచ్చే క్రమంలో అనేక సవాళ్లను అధిగమించాం. అన్నింటినీ పక్కనబెట్టి జీఎస్టీని అమలు చేసి చూపించాం. కోట్లాది చిన్న వ్యాపారుల సహకారంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేస్తున్నాం. దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు మొబైల్ ఫోన్లనూ ఉత్పత్తి చేస్తుంది. జాతీయ రహదారుల విస్తరణ దేశంలోని ప్రతి మూలను కలుపుతోంది. 2014 తర్వాత భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మోదీ స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.

దివాళా, బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేం పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయం. దేశ అభివృద్ధి ప్రయోజనాలే మిన్నగా మా నిర్ణయాలు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు.

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS