ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాం: సుష్మాస్వరాజ్

Sun,June 19, 2016 05:15 PM

We are trying to ensure that India becomes a member of NSG: Sushma Swaraj

న్యూఢిల్లీ: న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. బహుషా ఈ సంవత్సరం చివరికల్లా సభ్యత్వం వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో చైనాను ఒప్పించగలుగుతామనే ధీమాను వ్యక్తం చేశారు. భారత్ సభ్యత్వం తీసుకుంటానంటే చైనా ఏమీ వ్యతిరేకించడంలేదన్నారు. వేరే దేశాలు ఎన్‌ఎస్‌జీలోకి వస్తామంటే మన దేశం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదన్నారు. మరో 23 దేశాలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. మోదీ సర్కారు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.

యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతర్ వంటి దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించి మన దేశంతో ఆయా దేశాల ఆర్థిక సంబంధాలను ధృడపరిచారని వివరించారు. పాకిస్థాన్‌తో విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు కాలేదని తెలిపారు. పఠాన్‌కోట్ సంఘటనపై పాకిస్థాన్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న హింసాత్మక సంఘటనలు దురదృష్టకరమన్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టిందని వివరించారు. ఈమేరకు తమ విదేశాంగ శాఖకు లేఖ కూడా పంపిందని తెలిపారు. అయితే అధికారులు కొన్ని మార్పులు సూచిస్తూ ఈడీ అధికారులకు తిరిగి పంపించారని పేర్కొన్నారు. వారి నుంచి సమాధానం రాగానే దీనిపై స్పందిస్తామన్నారు.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles