విక్ర‌మ్ హార్డ్ ల్యాండింగ్‌.. అక్టోబ‌ర్‌లో ఆచూకీ !

Fri,September 27, 2019 01:53 PM

హైద‌రాబాద్‌: చంద్ర‌యాన్‌2కు చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ కోసం అమెరికాకు చెందిన నాసా అన్వేషిస్తున్న‌ది. అయితే ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అనుకున్న‌ట్లు విక్ర‌మ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. అది హార్డ్ ల్యాండింగ్ అయిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. సింపేలియ‌స్ ఎన్‌, మాంజిన‌స్ సీ క్రేట‌ర్ల మ‌ధ్య .. విక్ర‌మ్ ల్యాండ‌ర్ కూలి ఉంటుంద‌ని నాసా అంచ‌నా వేస్తున్న‌ది. నాసాకు చెందిన లూనార్ రికన్నాయిసెన్స్ ఆర్బిటార్ కెమెరా(ఎల్ఆర్ఓసీ) తీసిన ఫోటోల‌ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే క‌చ్చితంగా విక్ర‌మ్ ఏ ప్రాంతంలో కూలింద‌న్న విష‌యాన్ని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేమ‌ని నాసా స్ప‌ష్టం చేసింది.విక్రమ్ ల్యాండింగ్ కోసం టార్గెట్ చేసిన ప్రాంతానికి సంబంధించిన ప‌లు చిత్రాల‌ను నాసా రిలీజ్ చేసింది. చీక‌టిప‌డేవేళ రికన్నాయిసెన్స్ ఆర్బిటార్ ఫోటోలో తీసింద‌ని, దాని వ‌ల్ల ల్యాండ‌ర్‌ను లొకేట్ చేయ‌డంలో ఇబ్బంది ఎదురవుతున్న‌ట్లు నాసా చెప్పింది. సెప్టెంబ‌ర్ 7వ తేదీన విక్ర‌మ్ కూలిన విష‌యం తెలిసిందే. అయితే అది కూలిన ప్రాంతం మీదుగా రికన్నాయిసెన్స్ ఆర్బిటార్ సెప్టెంబ‌ర్ 17వ తేదీన ప్ర‌యాణించింది. ఎల్ఆర్ఓ కెమెరా తీసిన హై రెజ‌ల్యూష‌న్ ఫోటోల‌ను నాసా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశీలిస్తున్నారు. అగాధ ప్రాంతాల‌ను చీక‌టి క‌మ్మేయ‌డం వ‌ల్ల విక్ర‌మ్ ఆచూకీని క‌నిపెట్ట‌డం వీలుకాలేద‌న్నారు. అయితే మ‌ళ్లీ అక్టోబ‌ర్ నెల‌లో ఇదే ప్రాంతం మీదుగా రికన్నాయిసెన్స్ ఆర్బిటార్ ప్ర‌యాణించ‌నున్న‌ది. వెలుతురు స‌మ‌యంలో ఫోటోలు తీస్తే, అప్పుడు విక్ర‌మ్‌ను లొకేట్ చేయ‌డం సుల‌భం అవుతుంద‌ని నాసా చెప్పింది.

2507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles