విక్ర‌మ్ వెలాసిటీ..

Mon,September 9, 2019 12:25 PM

హైద‌రాబాద్‌: వేగానికి శాస్త్రీయ నామం వెలాసిటీ. విక్ర‌మ్ కూలిపోవ‌డానికి ఇదే కార‌ణమా ! వేగాన్ని కంట్రోల్ చేయ‌డమే చంద్ర‌యాన్‌2 ప్రాజెక్టులో అత్యంత కీల‌కం. 15 నిమిషాల్లో 30 కిలోమీట‌ర్ల దూరాన్ని విక్ర‌మ్ అతి సున్నితంగా చేరుకోవాలి. ఆ ప్ర‌క్రియలో జ‌రిగిన లోప‌మే విక్ర‌మ్‌ను కూల్చివేసింది ! సెప్టెంబ‌ర్ 7వ తేదీన రాత్రి 1.38 నిమిషాల‌కు ప‌వ‌ర్ డిసెంట్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇది రెండు ద‌శల్లో జ‌రిగింది. మొద‌టి ద‌శ ర‌ఫ్ బ్రేకింగ్‌. ఇక రెండ‌వ ద‌శ ఫైన్ బ్రేకింగ్‌. మొద‌టి ద‌శ‌లో మొత్తం నాలుగు ఇంజిన్లు విక్ర‌మ్ వేగాన్ని కంట్రోల్ చేస్తాయి. రెండ‌వ ద‌శ‌లో కేవ‌లం సెంట్ర‌ల్ ఇంజిన్ మాత్ర‌మే వేగాన్ని త‌గ్గించాలి. విక్ర‌మ్ త‌న చివ‌రి మ‌జిలీ మొద‌లుపెట్టిన స‌మ‌యంలో దాని వేగం సెక‌నుకు 6048 మీట‌ర్లు. నిజానికి మొద‌టి ద‌శ బాగానే సాగింది. ఇస్రో సెంట‌ర్‌లో ఆ స‌మ‌యంలో శాస్త్ర‌వేత్తలు హ‌ర్షాతిరేకాలు కూడా వ్య‌క్తం చేశారు. ర‌ఫ్ బ్రేకింగ్ ప్ర‌క్రియ ప‌ది నిమిషాలు ఉంటుంది. ఆ స‌మ‌యంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ 23 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాలి. ఈ ద‌శ‌ సాఫీగానే సాగింది. దాదాపు రాత్రి 1.48 నిమిషాల వ‌ర‌కు ఈ ర‌ఫ్ బ్రేకింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో కేవ‌లం చంద్రుడి ఉప‌రిత‌లానికి విక్ర‌మ్ ల్యాండ‌ర్ కేవ‌లం 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.


కానీ ఆ త‌ర్వాత ప్రారంభం అయిన ఫైన్ బ్రేకింగ్ ద‌శే విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను చంద్రుడి ఉప‌రితలాన్ని ఢీకొనేలా చేసింది. ఆ స‌మ‌యంలో ల్యాండ‌ర్‌లోని సెంట్ర‌ల్ ఇంజిన్ మాత్ర‌మే ప‌నిచేస్తోంది. అప్పుడు విక్ర‌మ్ వేగం సెక‌నుకు 86 మీట‌ర్లు. అయితే రాత్రి 1.51 నిమిషాల స‌మ‌యంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ మార్గంలో శాస్త్ర‌వేత్త‌లు స్వ‌ల్ప తేడా గ‌మ‌నించారు. చంద్రుడికి 2.1 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ గ‌తి త‌ప్పిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ వేగం సెక‌నుకు 50 మీట‌ర్లు మాత్ర‌మే ఉంది. అయితే చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగాల్సిన సంద‌ర్భంలో ల్యాండ‌ర్ వేగంలో అనూహ్య‌ మార్పులు జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దాని వ‌ల్లే అది ఉప‌రిత‌లాన్ని ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణం వ‌ల్లే అనుకున్న సాఫ్ట్ ల్యాండింగ్ జ‌ర‌గ‌లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌స్తున్నారు. ఆ రోజు తెల్ల‌వారుజామున 2.13 నిమిషాల‌కు విక్ర‌మ్ సంకేతాలు అంద‌డంలేద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ ప్ర‌క‌టించారు. ఫైన్ బ్రేకింగ్ ప్ర‌క్రియ స‌మ‌యంలో ఇంజిన్‌లో లోపాలు త‌లెత్తిన‌ట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. బెంగుళూరులోని ఇస్రో, కాలిఫోర్నియాలోని నాసా, క్యాన్‌బెరా సెంట‌ర్ల నుంచి కూడా ఫైన‌ల్ జ‌ర్నీ డేటాను శాస్త్ర‌వేత్త‌లు విశ్లేషిస్తున్నారు.

3996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles