
న్యూఢిల్లీ: దేశంలోనే వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) ప్రయాణ చార్జీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు ఫిబ్రవరి 15 నుంచి పట్టాలెక్కనుంది. ఇందులోని ఏసీ చెయిర్ కార్ టికెట్‌ను రూ.1850గా నిర్ణయించగా.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3520గా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ చెయిర్ కార్ ధరల కంటే ఈ ధరలు ఒకటిన్నర రెట్లు ఎక్కువ కాగా.. ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర 1.4 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెయిర్ కార్ టికెట్ రూ.1795, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ రూ.3470గా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడు రైలును ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక ఆహారం ధరలు కూడా రెండు తరగతులకు వేర్వేరుగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో వెళ్లే వాళ్లకు రూ.399 చార్జ్ చేయనున్నారు. ఇందులో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఉంటాయి. చెయిర్‌కార్‌లో వెళ్లే వాళ్లకు ఇది రూ.344గా ఉంటుంది. అదే వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లే వాళ్లకు ఈ ధరలు రూ.349, రూ.288గా ఉంటాయి.