నితిన్‌ గడ్కరీని మెచ్చుకున్న సోనియా గాంధీ

Thu,February 7, 2019 04:59 PM

UPA Chair Person Sonia Gandhi appreciates Nitin Gadkari performance

న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పనితీరును యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మెచ్చుకున్నారు. దేశంలో మౌలిక వసతులను నితిన్‌ గడ్కరీ అద్భుతంగా అభివృద్ధి చేశారన్న వ్యాఖ్యలపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు. ఇవాళ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా.. కేంద్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలకు నితిన్‌ గడ్కరీ వివరంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత తన మంత్రిత్వ శాఖ చేపడుతున్న పనులపై పార్టీలకతీతంగా ఎంపీలందరూ తనను మెచ్చుకుంటున్నారని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులందరూ గడ్కరీ పనితీరును మెచ్చుకుంటూ బల్లలు చరిచారు.

ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌ ఎంపీ గణేష్‌ సింగ్‌ లేచి నిలబడి.. గడ్కరీ అద్భుతమైన పనితీరును సభ్యులందరూ ప్రశంసించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విన్నవించారు. దీంతో సోనియాగాంధీ చిరునవ్వులు చిందిస్తూ.. బల్లను చరిచారు. అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు మిగతా సభ్యులు బల్లలు చరుస్తూ గడ్కరీ పనితీరును మెచ్చుకున్నారు. గతేడాది ఆగస్టులో తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన పనులకు సానుకూలంగా స్పందించడంతో నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతూ సోనియా లేఖ రాసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీలో దమ్మున్న నేత నితిన్‌ గడ్కరీ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళేమో.. గడ్కరీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు సోనియా నవ్వుతూ, తలుపుతూ కనబడటం విశేషం.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles