మేం ఎన్‌కౌంటర్ ఎలా చేస్తామో చూడండి..!

Thu,September 20, 2018 03:10 PM

UP Police invited journalists to watch an Encounter

అలీగఢ్: ఎన్‌కౌంటర్ల గురించి సాధారణ వ్యక్తులు వినడమే కానీ.. ఎప్పుడూ చూసే అవకాశం రాదు. అందుకేనేమో యూపీ పోలీసులు ఓ అడుగు ముందుకేశారు. మేం ఎన్‌కౌంటర్ ఎలా చేస్తామో చూస్తారా.. అయితే రండి అంటూ జర్నలిస్టులకు ఆహ్వానం పంపారు. వాళ్లు ఎన్‌కౌంటర్ చేస్తుంటే వీడియో తీయండి అంటూ కూడా చెప్పడం విశేషం. గురువారం ఉదయం ఇలా ఇద్దరు క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ముస్తాకిమ్, నౌషాద్ అనే ఆ ఇద్దరు క్రిమినల్స్ కోసం తాము చాలా రోజులుగా వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. గత నెలలో జరిగిన ఆరు హత్యల్లో వీళ్లు నిందితులు. వీళ్లు చంపిన వాళ్లలో ఇద్దరు హిందూ పూజారులు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఎలా మొదలైందన్న విషయాన్ని అలీగఢ్ పోలీస్ చీఫ్ అజయ్ సాహ్ని వివరించారు.

గురువారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ బైక్‌పై వెళ్తుండగా.. పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. అయితే వాళ్లు మాత్రం పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయారు. వాళ్లను చేజ్ చేయగా.. ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి దూరి అక్కడి నుంచి కాల్పుల జరపడం ప్రారంభించారు. ఈ సమయంలో మా పోలీసులు వాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు దుండగులు మృతి చెందారు అని ఆయన తెలిపారు. గత నెలలో జరిగిన అవే ఆరు హత్యలకు సంబంధించి మరో ఐదుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తం 66 మందిని ఎన్‌కౌంటర్లలో చంపినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.


3714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles