గత 13 రోజుల్లో 45వేల కోట్లు సరఫరా చేశాం: కేంద్ర ప్రభుత్వం

Tue,April 17, 2018 03:22 PM

న్యూఢిల్లీ: దేశంలో నగదు చెలామణిపై ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజా పరిస్థితులపై స్పందిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనలో ఈ అంశాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరెన్సీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం, ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కావాల్సిన క్యాష్ రిజర్వ్స్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే అన్ని ఏటీఎంలలో క్యాష్‌ను ఉంచేలా చర్యలను తీసుకుంటామన్నారు. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా నగదు కోసం డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. గత 13 రోజుల్లో సుమారు 45000 కోట్లు సరఫరా చేశామని ప్రభుత్వం తెలిపింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఎంపీ, బీహార్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉందన్నారు.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నామని, 500, 200, 100 డినామినేషన్ల కరెన్సీ కావాల్సినంత ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు అన్ని డిమాండ్‌లకు తగ్గ నగదును అందించామని, ఇంకా ప్రజలకు కావాల్సినంత కరెన్సీ తమ వద్ద ఉందని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ మునుముందు డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కూడా తమ దగ్గర అవసరమైన నగదు ఉందని పేర్కొన్నది. అన్ని ఏటీఎంలకు క్యాష్‌ను అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని, పనిచేయని ఏటీఎంలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


ప్రతి రోజూ రూ.500 కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రింట్ చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 500 నోట్ల ఉత్పత్తిని అయిదు రెట్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో 500 నోట్లకు చెందిన సుమారు 2500 కోట్ల కరెన్సీని సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో కరెన్సీ లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ రకంగా స్పందించారు. మరో నెల రోజుల్లో సుమారు 70 వేల నుంచి 75 వేల కోట్ల విలువైన కొత్త 500 నోట్ల కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆర్బీఐ గవర్నర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. మే 17వ తేదీన తమ ముందు హాజరుకావాలంటూ ఆ కమిటీ ఆదేశించింది.

2334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles