ట్రక్ డ్రైవర్‌కు 14 రోజుల రిమాండ్

Sat,August 22, 2015 03:05 PM

Udhampur terror attack: Truck driver remanded in custody

జమ్మూకశ్మీర్ : ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడి కేసులో ఎన్‌ఐఏ ఓ ట్రక్ డ్రైవర్‌ను నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే. ట్రక్ డ్రైవర్ ఖుర్షీద్ అహ్మద్ భట్‌ను ఇవాళ జమ్మూలోని టాడా కోర్టులో ఎన్‌ఐఏ ప్రవేశపెట్టింది. కోర్టు భట్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం భట్‌ను ఎన్‌ఐఏ జైలుకు తరలించింది.

ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ వాహనంపై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను ట్రక్కు డ్రైవర్ తన వాహనంలో జమ్ముకు తరలించినట్టు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల్లో ఒకడు బీఎస్‌ఎఫ్ దళాల కాల్పుల్లో మరణించగా, మరొక ఉగ్రవాది నవీద్‌ను గ్రామస్తుల సహాయంతో పట్టుకున్నారు. నవీద్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ట్రక్ డ్రైవర్ ఖుర్షీద్ అహ్మద్ భట్ అలియాస్ సుర్యాను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

ఉగ్రవాదులను భట్ రెండుసార్లు జమ్ముకు తరలించినట్టు తెలిసింది. అవంతీపురాకు చెందిన భట్ కూడా లష్కరే సంస్థ కోసం పనిచేస్తున్నట్టు ఎన్‌ఐఏ తెలిపింది. ఇదిలా ఉండగా, దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాక్ జాతీయుడు అబూ ఖాసింను పట్టించిన వారికి ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS