ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Thu,April 18, 2019 09:55 PM

Two Maoists killed in encounter with security forces in Chhattisgarh

కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిలాల్లో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని దౌలికరక అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలకు మావోయిస్టులు తారస పడి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. సుమారు 40నిమిషాల పాటు ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. జవాన్ల దాటికి తాళలేక మావోయిస్టులు పక్కనే ఉన్న అటవీలోకి పారిపోయారు.

అనంతరం భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. సంఘటన స్థలం నుంచి మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక 315బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, ఇతర పేలుడు పదార్థాలు, సాహిత్యాలు, ఇతర సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒకరు మలంగీర్ ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) స్టూడెంట్ వింగ్ ఇన్‌చార్జ్ వర్గీస్, మరొకరు కటేకల్యాణ్ లోకల్ ఆర్గనైజింగ్ స్కాడ్ సభ్యుడు లింగాగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే వీరు ఈ నెల 9వ తేదీన నుకల్‌నార్ ప్రాంతం సమీపంలో ఐఈడీ పేల్చి దంతేవాడ ఎమ్మెల్యే మాండవీని హత్యచేసిన కేసులో నిందితులని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఎదురు కాల్పుల్లో గాయపడిన మావోయిస్టు దస్రుని అదుపులోకి తీసుకొని చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మృతి చెందిన మావోయిస్టులపై రూ.5లక్ష రివార్డు ఉన్నట్లు ఎస్పీ ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా రాజ్‌నందర్‌గావ్ జిల్లాలో ఐటీబీపీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మేటా - టబ్బా గ్రామాలకు సమీపంలో రహదారికి మధ్యలో మావోయిస్టులు సైకల్‌తో అమర్చిన ఐఈడీ పేలడంతో విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐటీబీపీ బెటాలియన్‌కు చెందిన జవాన్‌కు తీవ్ర గాయాలయ్యయి. తోటి జవాన్లు వెంటనే క్షతగాత్రుడిని జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన జవాన్ పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles