విగ్రహం చోరీ కేసులో టీవీఎస్ చైర్మన్‌కు చిక్కులు

Fri,August 10, 2018 03:55 PM

TVS chairman applies for anticipatory bail

పుణ్యానికి పోతే పాపం ఎదురైందా? లేక లోగుట్టు ఏదైనా ఉందా? ఏమోగానీ.. పేరుపొందిన టీవీఎస్ సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిలు కోసం మద్రాస్ హైకోర్టు శరణు వేడాల్సి వచ్చింది. కాగా ఆరువారాల వరకు శ్రీనివాసన్‌ను అరెస్టు చేయబోమని సీబీసీఐడీ విభాగం కోర్టుకు తెలిపింది. ఇది కొంచెం ఊరట కల్పించే విషయమే అయినప్పటికీ విచారణను మాత్రం ఎదుర్కోక తప్పదు. చెన్నైలోని ప్రసిద్ధిపొందిన కపాలీశ్వర ఆలయంలో ధర్మదాతగా శ్రీనివాసన్ కొన్నాళ్ల క్రితం మరమ్మతు పనులు చేయించారు. ఆ సందర్భంగా ఓ ప్రాచీనకాలం నాటి నెమలి విగ్రహాన్ని తొలగించి కొత్త బొమ్మ తెచ్చి పెట్టారని పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆదారంగా చర్యలు తీసుకోవాలని ఎలిఫెంట్ జీ రాజేంద్రన్ అనే న్యాయవాది కేసు వేయడం శ్రీనివాసన్‌కు సమస్యలు తెచ్చిపెట్టింది. మైలాపూర్ పోలీసులు ఆ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సీబీ-సీఐడీ విగ్రహాల విభాగానికి కేసు అప్పగించారు. రంగరాజన్ నరసింహన్ అనే భక్తుని ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, తాను 2004లో సొంతడబ్బు రూ.70 లక్షలు పోసి ఆలయంలో పెయింటింగ్, ప్లోరింగ్ పనులను చేయించానని శ్రీనివాసన్ చెప్పుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యునిగా ప్రభుత్వం తనను నియమించినప్పటికీ పనులను పర్యవేక్షించింది మాత్రం ఎండోమెంట్స్ విభాగమేనని వివిరంచారు. తాను అందరిలాంటి భక్తుడినేనని, అంతకుమించి ఆలయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నివేదించారు. తిరుచ్చిరాపల్లి రంగనాథస్వామి ఆలయ ట్రస్టీల బోర్డు చైర్మన్‌గా తాను రు.25 కోట్లతో పునరుద్ధరణ పనులను చేయించానని కూడా పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేసిన ట్రస్టు తమిళనాడు, కర్నాటక, కేరళలో 100కు పైగా ఆలయాలకు మరమ్మతులు చేసిందిని కూడా తెలిపారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా తనకు ముందస్తు బెయిలు ఇప్పించాలని హైకోర్టును వేడుకున్నారు. శనివారం ఈ బెయిలు దరఖాస్తు న్యాయమూర్తి దండపాణి ధర్మాసనం ముందు విచారణకు వస్తుంది.

1034
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS