నోట్ల రద్దును అందుకే సీక్రెట్‌గా ఉంచాం: అరుణ్‌జైట్లీ

Wed,October 11, 2017 04:43 PM

Transparency in demonetisation is the greatest instrument of fraud says Arun Jaitly

వాషింగ్టన్: నోట్ల రద్దు, జీఎస్టీలాంటి ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ స్థితిలో నిలిపాయని అన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన.. నోట్ల రద్దుపై స్పందించారు. అంత పెద్ద సంస్కరణను ఎందుకు రహస్యంగా ఉంచారన్న విషయాన్ని వెల్లడించారు. పారదర్శకత అనే పదం వినడానికి బాగానే ఉంటుంది. కానీ నోట్ల రద్దు విషయంలో అది పనిచేయదు. మోసం జరగడానికి వీలుంటుంది. ఒకవేళ ముందుగానే ప్రకటించి ఉంటే.. ఆ డబ్బుతో బంగారం, భూములు, ఇండ్లు కొనేవాళ్లని, దానివల్ల నోట్ల రద్దు సంకల్పం దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతోనే అలా చేశామని జైట్లీ తెలిపారు. రహస్యంగా ఉంచినందుకే నోట్ల రద్దు అంతలా విజయవంతమైందని చెప్పారు. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ సంస్థాగత సంస్కరణలని, నిర్మాణాత్మక మార్పులని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా మరింత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఇవి తోడ్పడతాయని జైట్లీ అన్నారు.

న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. ఇది అతిపెద్ద నోట్ల మార్పిడి కసరత్తు. కొన్ని ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. టీవీ రిపోర్టర్లు బ్యాంకుల ముందు నిల్చున్న ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా వాళ్లు దానికి మద్దతు తెలిపారు అని జైట్లీ అన్నారు. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు రెట్టింపయ్యాయని, చాలా మంది పన్ను పరిధిలోకి కొత్తగా వచ్చారని చెప్పారు. షాడో ఎకానమీని రూపుమాపడానికి ఒకదాని తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాత్కాలికమైన ఇబ్బందులే ఉంటాయని స్పష్టంచేశారు.

3281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles