దోశ‌లమ్ముతూ 30 కోట్ల కంపెనీని నెలకొల్పాడు..!

Fri,November 30, 2018 04:42 PM

TN Man Set Up an Empire By Selling Dosas

అది 1990. ప్రేమ్ గణపతి అనే వ్యక్తి ముంబైలో అడుగుపెట్టాడు. ఏదో ఒక పని చేసుకొని బతుకును వెళ్లదీయడం కోసం ముంబైకి చేరుకున్నాడు ప్రేమ్. ప్రేమ్‌ది తమిళనాడులోని ట్యుటికొరిన్ జిల్లాలో ఉన్న నాగాలపురం. నిజానికి ప్రేమ్‌కు చదువంటే ప్రాణం. కానీ.. పేదరికం మనోడిని చదవనీయలేదు. దీంతో 10 వ తరగతి అయిపోగానే చెన్నైకి పయనమయ్యాడు. కానీ.. నెలకు 250 కంటే ఎక్కువ సంపాదించలేకపోయాడు. దీంతో జేబులో 200 రూపాయిలు పెట్టుకొని ఇంట్లో చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయాడు. అప్పటికి ప్రేమ్ వయసు 17 ఏళ్లు. ముంబైకి చేరుకున్న తర్వాత ఓ రోజంతా తిరిగాడు. ఎక్కడా ఏ పని దొరకలేదు. ఇంతలో ఓ వ్యక్తి ప్రేమ్‌ను జాబ్‌లో పెట్టిస్తా అని నమ్మబలికాడు. నెలకు 1200 జీతం అనే సరికి ప్రేమ్ కూడా సరేఅన్నాడు. కానీ.. ఆ వ్యక్తి ప్రేమ్ దగ్గర ఉన్న 200 దోచుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో వట్టి చేతులతో బాంద్రాలో దిక్కులేకుండా మిగిలిపోయాడు ప్రేమ్.

అయినా ప్రేమ్‌లో పట్టుదల చావలేదు. వెంటనే పని వేట ప్రారంభించాడు. మాహిమ్‌లో ఉన్న ఓ బేకరీలో గిన్నెలు కడగే పనికి కుదిరాడు. నెలకు 150 రూపాయలు జీతం. బేకరిలోనే పనిచేసి.. అక్కడే పడుకునేవాడు. అలా.. ఓ రెండు సంవత్సరాలు వివిధ రెస్టారెంట్లలో పనిచేశాడు ప్రేమ్. 1992లో తన సొంత వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బులను సమకూర్చుకున్నాడు ప్రేమ్. వాసి రైల్వేస్టేషన్ ముందు ఇడ్లీ, దోశా సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. దాని కోసం 1150 రూపాయలు ఖర్చు చేశాడు. అలా.. ఇడ్లీ, దోశా సెంటర్ నుంచి ఇప్పుడు 30 కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు ప్రేమ్. కొన్ని నెలల్లోనే ప్రేమ్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించాడు. తన ఇద్దరు సోదరులను కూడా ముంబైకి రప్పించాడు. ఫుడ్ కోర్ట్‌లో వాళ్లు కూడా భాగస్వామ్యం అయ్యారు.

"మేము క్వాలిటీ, పరిశుభ్రత విషయంలో అస్సలు రాజీ పడలేదు. రోడ్ సైడ్ ఫుడ్ అంటే హైజీన్‌గా ఉండదు.. అనే మాట రాకుండా చేయాలకున్నాం. మా స్టాఫ్ కూడా నీట్‌గా డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకుంటారు. మా ఊళ్లో దోశ, సాంబార్ చేసే విధానాన్ని నేర్చుకొని ఆ వంటకాలను ఇక్కడ చేయడం ప్రారంభించా. దీంతో నా బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయల్లా మారింది. కస్టమర్లకు నేను చేసే దోశ, సాంబారు టేస్ట్ నచ్చింది. దీంతో మేము నెలకు 20 వేల వరకు సంపాదించడం ప్రారంభించాం.

తర్వాత వాసిలో చిన్న రూం రెంట్‌కు తీసుకున్నాం. ఇడ్లీ, దోశ, సాంబారుతో పాటు స్పెషల్ మసాలాలు తయారు చేయడం ప్రారంభించాం. అలా 1997లో వాసిలో మా మొట్టమొదటి రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాం. 50 వేల డిపాజిట్‌తో పాటు నెలకు 5000 రెంటు దానికి పే చేయాలి. దానికి ప్రేమ్ సాగర్ దోశా ప్లాజా అని పేరు పెట్టాం. మరో ఇద్దరు పనివాళ్లను తీసుకున్నాం. ఆ రెస్టారెంట్‌కు ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేవాళ్లు. వాళ్లే నాకు ఇంటర్నెట్‌ను అలవాటు చేశారు. అంతే కాదు.. ఇంటర్నెట్‌లో కొత్త కొత్త రెసిపీలను ఎలా నేర్చుకోవాలో కూడా నేర్పించారు. దీంతో నేను దోశాలో రకరకాల వెరైటీలు ఎలా చేయాలో నేర్చుకున్నా. స్కెజ్వాన్, పన్నీర్ చిల్లీ, స్ప్రింగ్ రోల్.. ఇలా 26 రకాల వంటకాలను మా రెస్టారెంట్లలో ప్రారంభించాం. 2002 వరకు ఒక్క దోశాలోనే 105 వెరైటీలను ప్రారంభించాం.

తర్వాత సెంటర్ వన్ మాల్ వాసికి సమీపంలో మాల్‌ను ఓపెన్ చేస్తున్నట్టు తెలిసింది. మాల్ ఓనర్స్ కూడా మా రెస్టారెంట్‌లో దోశా తిని దోశ టేస్ట్‌ నచ్చి వాళ్ల మాల్‌లో ఔట్‌లెట్ ఓపెన్ చేయాలని ఆఫరిచ్చారు. అలా.. 2003 లో థానెలోని వండర్ మాల్‌లో మా ఫస్ట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించాం. అంతే.. అప్పటి నుంచి మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 70 దోశా ప్లాజా ఔట్‌లెట్లను ప్రారంభించాం. మా దోశా ప్లాజా ఔట్‌లెట్లు న్యూజిలాండ్, దుబాయ్, ఒమన్‌లోనూ ఉన్నాయి.." అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు ప్రేమ్.

నెలకు 250 రూపాయల శాలరీ నుంచి ఇప్పుడు 30 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి అధిపతి కావడానికి ప్రేమ్‌కు దశాబ్దాలు పట్టొచ్చు. కానీ.. ఆరోజు ముంబైలో తన దగ్గర ఉన్న 200 రూపాయలను ఎవరో కొట్టేస్తే.. వెంటనే మరో ట్రెయిన్ పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్లలేదు ప్రేమ్. అలా వెళ్లి ఉంటే ప్రేమ కథ మరోరకంగా ఉండేది. ఎంత కష్టమైనా.. నష్టమైనా ముంబైలోనే ఉన్నాడు. పట్టుదలతో పనిచేశాడు. సాధించాడు. జీవితంలో సక్సెస్ అయ్యాడు.

3125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles