మైసూరు చిరుధాన్యాల డాక్టర్.. యూఎస్ జాబ్‌ను వదిలి ఆరోగ్య భారత్ కోసం

Mon,February 18, 2019 05:25 PM

మన తాతలు, ముత్తాతలు 100 ఏళ్లు బతికేవాళ్లు. ఇప్పుడు 50 ఏళ్లు దాటితో రోజుకు ట్యాబెట్లు వేసుకోనిదే శరీరం సహకరించదు. 60 ఏళ్లు వస్తే ఎప్పుడు పోయేది తెలియదు. 100 ఏళ్లు బతకడం అనేది ఇప్పుడు కలే. ఎందుకో అందరికీ తెలుసు. పెస్టిసైడ్స్, కెమికల్స్ వేసి పండించిన పంటలు తినడం, తినాల్సినవి కాకుండా అనవసరమైనవి తినడం, కల్తీ పదార్థాలు తినడం.. ఇవే మనిషిని రకరకాల రోగాలతో హరించేస్తున్నాయి. అప్పట్లో మన తాతలు, ముత్తాతలు వందేళ్లు బతికేవారంటే దానికి కారణం మిల్లెట్స్(చిరుధాన్యాలు). వాళ్లకు ఈ చికెన్ బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ అలవాటు లేవు.


కానీ.. ఇప్పుడో ఉన్నవి లేనివి.. ఏది పడితే అది కడుపులో పడేస్తుంటాం. అవి రకరకాల రోగాలను తీసుకొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ డయాబెటిస్, ఒబెసిటీ, గ్యాస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది.

అందుకే నేటి జనరేషన్ మళ్లీ పాతకాలంలోకి వెళ్లింది. పాత కాలం ప్రజలు తిన్న అవే చిరుధాన్యాలను మళ్లీ తినడం ప్రారంభించారు. వాటికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. వాటిలో ఉండే విటమిన్స్.. వాటి వల్ల కలిగే లాభాలు.. ఇతరత్రా గురించి ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లింది ఎవరంటే.. డాక్టర్ ఖాద‌ర్‌ వల్లీ అనే చెప్పాలి. మైసూర్‌కు చెందిన ఖాద‌ర్‌ వల్లీని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అందుకే పిలుస్తారు. భారతదేశాన్ని ఆరోగ్యంగా చూడటం కోసం.. ఆయన కోట్ల ప్యాకేజీ ఉన్న యూఎస్ జాబ్‌ను తృణప్రాయంగా వదిలేసి ఇండియాకు వచ్చారు.

మైసూర్‌కు చెందిన ఖాద‌ర్‌ బీఎస్సీ, ఎమ్మెస్సీని మైసూర్‌లోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చదివారు. తర్వాత బెంగళూరులోని ఐఐఎస్సీలో స్టెరాయిడ్స్‌లో పీహెచ్‌డీ చేశారు. తర్వాత యూఎస్‌లో సైంటిస్ట్‌గా పనిచేశారు. 34 ఏళ్ల క్రితం ఆయనకు ఎదురైన ఓ సంఘటన తన జీవితాన్నే మార్చేసింది. 1986-87 సమయంలో ఆరేళ్ల బాలికకు పీరియడ్స్ రావడాన్ని తెలుసుకున్నారు. ఆయన ఆ ఘటనపై షాకవ్వడమే కాదు.. అసలు ఎందుకిలా జరుగుతోందని ఆధ్యయనం చేయడం ప్రారంభించారు. అసలు సమస్య ఎక్కుడుందో పరిశోధించారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అన్ని ఆరోగ్య సమస్యలకు మూలం.. ఆహారమేనని తెలుసుకున్నారు. సహజ సిద్ధంగా కాకుండా.. రసాయనాలతో పంటలు పండించడం, చిరు ధాన్యాలను తినడం ప్రజలు మానేయడం.. కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం లాంటి వాటి వల్లనే ప్రజలను అసాధారణ వ్యాధులు వస్తున్నాయని గుర్తించారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారించడం కష్టమని భావించి తన యూఎస్ జాబ్‌ను వదిలేసి మైసూరుకు వచ్చేశారు వల్లీ.

మైసూర్‌లోని టీకే లేఅవుట్‌లో డాక్టర్ వల్లీ నివసిస్తారు. ఆయన నివాసం ముందు రోజు పెద్ద క్యూ ఉంటుంది. క్యాన్సర్, డయాబెటిస్, హెచ్‌ఐవీ.. ఇలా అన్ని రకాల జబ్బులతో బాధపడేవాళ్లు కూడా డాక్టర్ వల్లీ దగ్గరికి వస్తారు. వాళ్లకు ఆయన ఆహారం ప్రాముఖ్యాన్ని వివరిస్తారు. మిల్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలను చెబుతారు. ఎప్పుడు ఏది తినాలో వివరిస్తారు. అల్లోపతి మందులు ఇవ్వడం ఏమీ ఉండదు. చిరు ధాన్యాలైన అరికెలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు... వీటిని తినాలంటూ సూచిస్తారు. చాలామందికి ఇంగ్లీష్ వైద్యంతో నయం కాని ఎన్నో జబ్బులను డాక్టర్ వల్లీ నయం చేయగలిగారు. అది కేవలం చిరు ధాన్యాల వల్లనే. ఇలా రోజుకు వందల మంది రోగులకు చిరు ధాన్యాలతో చికిత్స చేస్తుంటారు వల్లీ. దేశంలోని నలుమూలల నుంచి డాక్టర్ వల్లీ ద‌గ్గ‌ర చికిత్స తీసుకోవ‌డానికి ఎంతోమంది అక్కడికి వెళ్తుంటారు.

"నా ప్రిస్క్రిప్షన్ లో ఇంగ్లీష్ మందులు ఉండవు.. నా పేషెంట్స్‌కు 5 రకాల సిరి ధాన్యాలు తినాలని సూచిస్తాను. 60 ఏళ్ల కింద మన తాతలు, ముత్తాతలు తిన్నవి వాటినే. ఏ ఆహారం అయినా అది రక్తంలో కలిసిపోవాల్సిందే. అయితే.. ఆ ఆహారంలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ రక్తంలో కలవడానికి ఎంత ఎక్కువ సమయం పడితే అది అంత ఆరోగ్యకరమైన ఆహారం అన్నమాట. రాగులు రక్తంలో కలవడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. ఇతర చిరు ధాన్యాలు రక్తంలో కలవడానికి ఆరు గంటలకు పైగా పడుతుంది. అదే మనం రోజూ తినే అన్నం రక్తంలో కలవడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందుకే.. అన్నం ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిరు ధాన్యాల వల్ల మనుషులకే కాదు నేలకు కూడా లాభమే. సాధారణంగా ఏ పంట పండించాలన్నా ఎక్కువ నీళ్లు కావాల్సిందే. కానీ.. చిరు ధాన్యాల పంటకు 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే చాలు. సాగునీరు లేని నేలల్లో కూడా చిరుధాన్యాలను పండించుకోవచ్చు. ఒక కేజీ మిల్లెట్స్‌ను పండించడానికి 200 లీటర్ల నీళ్లు మాత్రమే అవసరముంటుంది. కానీ.. ఒక కేజీ బియ్యం లేదా గోదుమలు పండించడానికి 9000 లీటర్ల నీళ్లు కావాలి.." అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్ వల్లీ.

4306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles