జేసీబీలో పెండ్లి ఊరేగింపు.. పెండ్లి కొడుకు వినూత్న ప్రయత్నం.. వీడియో

Thu,June 21, 2018 03:00 PM

This karnataka Bridegroom chose JCB digger as his wedding procession

సాధారణంగా పెండ్లి ఊరేగింపులు ఎలా జరుగుతాయి. లగ్జరీ కారులోనో లేదంటే గుర్రపు బండ్ల మీదనో ఊరేగిస్తారు. కాని.. ఈ పెండ్లి కొడుకు ఏంటండి.. తన ఊరేగింపుకు ఏకంగా జేసీబీని ఎంచుకున్నాడు. ఏంటి.. నోరెళ్లబెట్టారా? కాని.. మనోడు తన పెండ్లి ఊరేగింపుకు జేసీబీని ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉందట. సరే.. ఏంటో తెలుసుకుందాం పదండి.

కర్ణాటకలోని సౌత్ కన్నడ జిల్లా పుత్తూర్‌కు చెందిన చేతన్.. మమత అనే యువతిని గత సోమవారం వివాహమాడాడు. వివాహం అనంతరం జరిగే పెండ్లి ఊరేగింపు కోసం ముందే జేసీబీ వాహనాన్ని అలంకరించారు. దానికి ముందు ఉండే డిగ్గర్‌ను డెకరేట్ చేశారు. దాని మీద ఓ చాప వేశారు. ఇక.. ఊరేగింపు ప్రారంభం అవుతుందనగానే పెండ్లి కూతురుతో సహా వచ్చి జేసీబీ డిగ్గర్ మీద కూర్చున్నాడు పెండ్లి కొడుకు. వెంటనే డప్పుల మోతతో మనోడి పెండ్లి ఊరేగింపు స్టార్ట్ అయింది.

ఇక.. ఈ వినూత్న ఊరేగింపును చూసిన అక్కడి స్థానికులు మాత్రం ముక్కు మీద వేలేసుకున్నారట. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మనోడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.

"నేను జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. జేసీబీ నాకు ఎంతో ఇచ్చింది. అదే లేకపోతే నేను లేను. ఈ పెండ్లే లేదు. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదించి నా కాళ్ల మీద నిలబడగలిగినానంటే దానికి కారణం జేసీబీనే. అందుకే.. నా పెండ్లి ఊరేగింపుకు కారునో.. లేదంటే మరేదో వాహనాన్ని వాడకుండా జేసీబీని సెలెక్ట్ చేసుకున్నా.." అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు పెండ్లి కొడుకు.

సరే.. సరే.. నీ నిర్ణయం బాగుందోయ్. నీకు పని కల్పించి నాలుగు రాళ్లు సంపాదించడానికి సహాయ పడిన ఆ మిషన్‌కు ఎంతో విలువ ఇచ్చిన నీకు హ్యాట్సాఫ్.

5848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS