23x34432 ఎంత? ఈ పన్నెండేండ్ల పిల్లాడు సెకండ్‌లో ఆన్సర్ చెప్పేస్తాడు..!!

Sun,January 21, 2018 03:10 PM

This 12 Year old UP boy makes wonders with numbers with multiplication

నిజమే.. ఆ పిల్లాడికి కూడికలు, తీసివేతలు, గుణకారాలంటే వెన్నతో పెట్టిన విద్య. మీరు వీటిలో నుంచి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తాడు. మీరు కాలుక్యులేటర్‌లో లెక్క చేసేంతలోపే ఆన్సర్ చెప్పేస్తాడు. అవునా.. అని నోరెళ్లబెట్టకండి... ఆ పిల్లాడి కథేందో తెలుసుకుందాం పదండి.

అది ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా. ఆ జిల్లాలోని నాకుడ్ త్రిపుడి గ్రామానికి చెందిన 12 ఏండ్ల పిల్లాడు చిరాగ్ రాతి స్థానికంగా ఉన్న జిలా సింగ్ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అందరు పిల్లల మాదిరిగా ఉంటే ఇప్పుడు మనం ఆ పిల్లాడి గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు. ఆ పిల్లాడో మ్యాథ్స్ జీనియస్. ఆ పిల్లాడిని మ్యాథ్స్ లెజండ్ శకుంతలా దేవితో పోల్చుతారు అక్కడి జనాలు.

దాదాపు 20 కోట్ల రేంజ్‌లో ఉన్న ఏ నెంబర్స్‌కైనా గుణకారం, తీసివేత, కూడిక ఇట్టే చెప్పేయగలడు చిరాగ్. మనమైతే 20 వ ఎక్కం వరకు చెప్పడానికే నానా తంటాలు పడతాం. మనోడి టాలెంట్‌ను గుర్తించిన స్కూల్ యాజమాన్యం.. మనోడి కోసం సపరేట్‌గా ఓ మ్యాథ్స్ టీచర్‌నే అపాయింట్ చేసిందట. అంతే కాదు.. చిరాగ్ ఇప్పుడు 12 వ క్లాస్ మ్యాథ్స్‌ను కూడా ఔపోసన పట్టేశాడట.

"చిరాగ్ ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే అతడిలో ఉన్న మ్యాథ్స్ స్కిల్స్‌ను పసిగట్టాం. మ్యాథ్స్ టీచర్ల కంటే ఫాస్ట్‌గా లెక్కలు చేయడం గమనించాం. దీంతో అప్పటి నుంచి చిరాగ్‌కు స్పెషల్‌గా మ్యాథ్స్ టీచర్‌ను పెట్టించి మ్యాథ్స్ నేర్పిస్తున్నాం" అని అంటున్నాడు చిరాగ్ చదివే స్కూల్ ప్రిన్సిపల్ విశ్వాస్ కుమార్.

"నాకొడుకు దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నదే నా కోరిక. సైంటిస్ట్ కావాలనేదే అతడి కోరిక. చిరాగ్ లక్ష్యం కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నాకు ఉన్న కొంచెం జాగను అమ్మి లేదంటే నా కిడ్నీని అమ్మి అయినా చిరాగ్ సైంటిస్ట్ కావాలనే లక్ష్యాన్ని నెరవేరుస్తా..." అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు చిరాగ్ తండ్రి నరేంద్ర.

అయితే.. చిరాగ్ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం.. చిరాగ్‌కు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు ఫ్రీగా బుక్స్ కూడా ఇస్తున్నది. ఇవన్నీ సరే.. అసలు ఈ లెక్కలన్నీ ఇంత ఫాస్ట్‌గా ఎలా చేస్తున్నావు అని ఎవరైనా చిరాగ్‌ను అడిగితే.. కొంచెం సిగ్గు పడుతూ... ఏమంటాడో తెలుసా?

"నెంబర్స్ అంటేనే ఫన్. నాకు వాటి ఆన్సర్స్ అలా సహజంగా వచ్చేస్తాయి. నా స్కూల్ మేట్స్, ఫ్రెండ్స్ కూడా నన్ను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు.. ఏయ్.. నువ్వు ఏదో టెక్నిక్‌తోనో లేదంటే ఏదైనా ఫార్ములాతోనో ఈ లెక్కలన్నీ ఇంత ఫాస్ట్‌గా చేస్తున్నావు కదా అంటూ.. కాని నాకు అటువంటి టెక్నిక్‌గానీ.. ఫార్ములా కాని ఏదీ తెల్వదు" అని అంటాడు చిరాగ్.

సరే మ్యాథ్స్ జీనియస్.. మరి సైంటిస్ట్ అయి ఏం చేస్తావు అని అడిగితే... "నేను సైంటిస్ట్ అయి ఈ దేశం గర్వించేలా పని చేస్తా. దేశ ప్రధాని మోదీజీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీజీని నా ఊరికి పిలుస్తా" అంటూ సిగ్గు ప‌డ్డాడు చిరాగ్.

చిరాగ్ కన్న కలలు నిజమవ్వాలని.. తను ఈ దేశానికి ఓ ఐకాన్ కావాలని... దేశం గర్వించేలా చిరాగ్ ఎదగాలని మనమూ ఆశిద్దాం.

7734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles