పాముకాటుతో పరమానందం

Fri,September 14, 2018 04:04 PM

They ae addicted to snake bite that too on tounge

జరజర పాకే నాగులంటే చాలామందికి పిచ్చిభయం. నాగుపాము పేరెత్తితే వణికిపోతారు. ఇక కనిపించిందా.. బిగుసుకుపోతారు. కానీ ఆ ఇద్దరు కుర్రవాళ్లు మాత్రం పామును ముద్దాడుతారు. నాలుక చాపుతారు. పాము ఓ కాటు వేయగానే మత్తులో మునుగుతారు... మరోలోకంలోకి పోతారు... ఆ మత్తు కోసం ఎన్నిసార్లయినా పాముతో కుట్టించుకుంటారు. పాము ఒక్క కాటులో విడుదల చేసే విషం 20 మంది మనుషులను, లేదా ఓ ఏనుగుని చంపుతుంది. రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ ఆ ఇద్దరికి మాత్రం పాముకాటు తప్ప మరేదీ కిక్కు ఇవ్వడం లేదట. ఆ కిక్కే వేరప్పా అంటారు వారు. పాము విషానికి బానిసలైన ఆ ఇద్దరు యువకులు సంపన్న కుటుంబాలవారే.

రాజస్థాన్‌కు చెందిన ఆ ఇద్దరు యువకులపై ప్రస్తుతం చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యా సంస్థలో పరిశోధన జరుపుతున్నారు. మాదకద్రవ్య బాధితుల పునరావాస కేంద్రంలో వారిని ఉంచారు. వారి కేసు హిస్టరీని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ తాజాసంచికలో ప్రచురించారు. మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా పాము విషం అనే శీర్షికన వెలువరించిన వ్యాసంలో వెల్లడించిన అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. ఇదివరకు కాలిమీద, చేతిమీదా కాట్లు వేయించుకున్న కేసులను చూశాం గానీ, ఇలా నాలుక మీద కాటు వేయించుకోవడం ఇప్పుడే చూస్తున్నాం అని పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరూ రాజస్థాన్‌లోని వాయవ్య ప్రాంతంలోని గిరిజన తెగకు చెందినవారు. పాము విషాన్ని తమ తెగవారు మత్తుకోసం విడిగా లేదా ఇతర మత్తుపదార్థాలతో కలిపి తీసుకోవడం మామూలేనని వారు అంటున్నారు. కాకపోతే ఇప్పటివరకు వైద్యరంగం దృష్టికి వచ్చిన ఇలాంటి కేసులు మాత్రం నాలుగే.

4914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS