కార్పొరేట్ విద్యార్థులకు ఖైదీలకు ఉన్న స్వేచ్ఛ కూడా లేదు

Thu,October 19, 2017 02:09 PM

There is no freedom of the prisoners for corporate college students

తరగతి గదిలోనే ఈ దేశ భవిష్యత్ రూపుదిద్దుకుంటుంది. రజనీ కొఠారీ చెప్పిన సుప్రసిద్ధమైన సందేశమిది. ఈనాటి చదువులు, విద్యార్థుల చావులను పరిశీలిస్తుంటే మన భవిష్యత్ ఏమిటని ఆందోళన కలిగిస్తున్నది. మానవ వనరుల అభివృద్ధి, వికాసంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పిన కొఠారీ కమిషన్ సూచనలు బుట్టదాఖలైనట్లే. ఇప్పుడు మానవ వనరుల విధ్వంసంమవుతున్నా వ్యవస్థలన్నీ మౌనంగా చూస్తూ ఉన్నాయ్.

యవ్వనం ఉరితాళ్లకు వేలాడుతుంటే కన్నపేగు శోకం పెడుతున్నది. కాలేజీ గేటుముందు శోకం పెట్టిన బిడ్డల బాధల్ని అర్థం చేసుకుని ఉంటే ఈ శిక్ష తప్పేదే అని ఏడుస్తున్నరు అమ్మలు. వాళ్ల కన్నీళ్లకు న్యాయం చేయకున్నా ఇంకొకరికి కనువిప్పు కలిగించకపోవడం శోఛనీయం. అమానవీయం. ర్యాంకుల వేలంవెర్రిలో పిల్లల జీవితాల్ని బలిపెడుతున్న అమ్మానాన్నలారా ఇప్పటికైనా ఆలోచించండి. ఆ చావులకు కాలేజీ యాజమాన్యాలదే తప్పు కాదు. తల్లిదండ్రులది కూడా. ఆ తప్పు మీరూ చేయకండి. ప్లీజ్. పిల్లల్ని చదవనివ్వండి. ఎదగనివ్వండి. వాళ్ల ఎదుగుదలకు సాయపడండి. కానీ ఎదుగుదల పేరుతో వాళ్లను చంపకండి.

జైళ్ళా..?
బాధగా ఉంటే మరొకరితో చెప్పుకుని మనసు బరువు తీర్చుకోవచ్చు. నీరసంగా ఉంటే కాసేపు నిద్ర పోవచ్చు. మనసు ప్రశాంతంగా లేకుంటే నలుగురితో మాట్లాడుతూ అశాంతిని తగ్గించుకోవచ్చు. కొద్దిగా ఏకాంతం కావాలనుకుంటే బ్యారక్‌లను దాటి ఆరుబయట తిరగొచ్చు. ఇవన్నీ జైలులో ఖైదీలకు ఉండే అవకాశాలు. బాగా చదవించాలని చేర్చిన కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులకు ఖైదీలకు ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. అక్కడ సూర్యుడు ఉదయించినది, చీకట్టిపడ్డది తెలియదు. గోడ గడియారమే వాళ్లను నడిపిస్తుంది. గడియారం ముల్లులాగే లేచిన దగ్గర్నుంచి షెడ్యూల్‌ని ఫాలో అవుతూ సాగిపోవాల్సిందే. ఆగిపోతే అవమానాలే. అక్కడ ఎవరు ఎవరితోనూ మాట్లాడుకునే అవకాశం లేదు. రోజులో 12 గంటలపాటు చదువు.. చదువు.. చదువే.. సమయం ఉండదు. నిద్ర ఒక్కక్కరికి ఒకోలా ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఇళ్లలో నిద్ర పోతారు. కానీ ఇక్కడ నీరసంగా ఉన్నా, రాత్రి నిద్రపట్టకున్నా 5 గంటలకు లేవాల్సిందే. అందరూ ఒకేసారి లేవాలి. ఒకేసారి పడుకోవాలి. చదవాలనిపించకున్నా స్టడీ అవర్స్‌లో గంటలపాటు ముఖాన్ని పుస్తకంలోనే ఉంచాలి. పాఠం వినే ఓపిక లేకున్నా చెప్పే సాహసం కూడా చేయరు. అక్కడి రూల్స్ అంత భయంకరంగా ఉంటాయి. తలనొప్పి, కడుపునొప్పి సాకులు చెప్పి పాఠాలు తప్పించుకున్నా వదలరు. క్లాస్‌రూమ్‌ల పక్కనే ఓ గదిలో విశ్రాంతి తీసుకోమంటారు. కదలకుండా అక్కడ పడుకోవాలి. కాలు బయటపెడితే పదా క్లాస్‌కి అంటూ హెచ్చరిస్తారు.

దండనీతి..
విద్యార్థి వయసు, అతడు పుట్టి పెరిగిన భౌతిక పరిస్థితులతో సంబంధంల లేకుండా విద్య చెప్పడం తప్పని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ఇలాంటి విద్యాబోధన వల్ల విద్యార్థులు నేర్చుకోలేరని, నేర్చుకున్నా నిజ జీవితంలో దానితో ప్రయోజనం ఉండదని చెబుతోంది. ఈ పాఠ్యాంశాల రూపకల్పనే విద్యార్థి పెరిగిన భౌతిక పరిసరాలకు సంబంధం లేనిదయితే, ఈ కళాశాలలు కనీసం నేర్చుకునే అవకాశం కూడా లేకుండా తమకు అనుగుణంగా విద్యార్థిని మలచేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. పిల్లల మానసిక స్థితి ఏమిటి? అని ఆలోచించకుండానే తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తున్నారు. సాధారణంగా విద్యార్థుల్లో నాలుగు రకాల లెర్నింగ్ స్కిల్స్ ఉన్నవారుంటారు. కొందరు చెప్పింది విని అర్థం చేసుకుంటారు. మరికొందరు చదివి నేర్చుకుంటారు. కొందరు రాయడం ద్వారా నేర్చుకుంటారు. ఇంకొందరు చెప్పడం ద్వారా నేర్చుకుంటారు. కార్పొరేట్ విద్యా బోధనలో పాఠ్యపుస్తకాలకు బదులు బిట్లు బిట్లుగా ముద్రించిన పుస్తకాలు ఇస్తారు. పాఠం చెప్పేది ఒకరు. చదివించేది మరొకరు. పరీక్షలు నిర్వహించేంది ఇంకొకరు. ఇలాంటి విద్యావిధానంలో ఏ విద్యార్థి మానసిక స్థితి ఏమిటి? ఎలా అర్థం చేసుకుంటాడో అధ్యాపకుడికి అవగాహన ఉండదు. విద్యార్థులను రెచ్చగొట్టడం, న్యూనతకు గురిచేయడం వల్ల పోటీపడి చదువుతారని భావిస్తారు. టీచింగ్‌పట్ల విద్యార్థుల ఫీడ్ బ్యాక్ యజమాన్యానికి అవసరమే లేదు. అన్‌ఫిట్ అనే మాటను పదే పదే వింటూ అవమానంతో విద్యార్థులు కుంగిపోతున్నారు. మారేందుకు అమ్మానాన్నలు ఒప్పుకోరు. కాలేజీలో అధ్యాపకులు ఊరుకోరు. ఈ ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యకు పూనుకుంటున్నారు.

మార్కులే టార్గెట్
వారం వారం నిర్వహించే పరీక్షలో మార్కుల్ని క్లాస్‌రూమ్‌లో, బయట నోటీస్ బోర్డులపై అతికిస్తారు. ఆరోజు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లను అందరి ముందూ లేపి నిలబెడతారు. ఇలా చదివితే నీవు పనికిరావంటూ ప్రసంగం మొదలుపెట్టి, ఇతరులతో పోల్చుతూ, మీ అమ్మానాన్నల కష్టాలు, స్వప్నాలంటూ చాలా ఉపన్యాసాలు చెబుతారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకూ ప్రశంసలుండవు. ఈ మార్కులకు సీటు వస్తుంది.కానీ టాపర్‌వి కాలేవు. బాగా చదువు టాప్‌లో ఉంటావంటూ చెబుతారు. నోటీస్ బోర్డులో స్నేహితులు చూసేలా మార్కులు డిస్‌ప్లే చేసినట్లుగానే అమ్మానాన్నలకు మెసేజ్ పంపుతారు. పేరెంట్స్ పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ మార్కుల ప్రస్తావనే తెస్తారు. బాగా తింటున్నావా? అనడగరు. బాగా చదువు. మంచి ర్యాంక్ రావాలి. నీవు డాక్టర్‌వి కావాలంటూ ఉన్న కొద్ది కాలాన్ని పిల్లల్ని భయపెట్టడానికే ఉపయోగించుకుంటారు. కానీ ఇంటిదగ్గరి విశేషాలు ప్రేమగా చెప్పరు. పిల్లల ఇబ్బందుల్ని ఆలకించరు. నెలలు గడుస్తున్నా కొద్దీ పిల్లలు చెప్పేది వినకుండా ఇన్ని వారాలయినా ఇంకా అలవాటు కాకపోతే ఎట్లా అంటూ భయపెడతారు. ఇంటికి తీసుకుపోమని కరాఖండిగా చెప్పేస్తారు. ఆ తర్వాత పిల్లలు తమ ఇబ్బందుల్ని చెప్పుకోవడం ఆపేస్తారు. చెబితే నీకు చదవడం చేతకాదని అంటారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడూ అందరూ మంచిగా, స్నేహంగా ఉండడని చెప్పరు. కాసేపు మాట్లాడుకోండని స్నేహాల్ని ప్రోత్సహించరు. నీవు బాగా చదువు. ఎవరితోనూ ముచ్చట్లు పెట్టకు, స్నేహం చేయకనే మాటలే ఇక్కడ ఎక్కువగా చెబుతారు. అమ్మానాన్నలే ఇలా ఉంటే ఇక పంతుళ్లు అంతకంటే ఎక్కువ. వారం వారం నిర్వహించే పరీక్షల సందర్భాల్లో ఎవరైనా విద్యార్థి పక్కవాళ్లను ఒక బిట్‌కు సమాధానం అడిగితే అధ్యాపకులు ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇలా చూపిస్తే నీవు నష్టపోతావ్. రేపు నీకు రావాల్సిన సీటు ఆయనకు వస్తుంది. నీ చదువు వేస్ట్ అవుతుందని భయపెడతారు. అలా విద్యార్థుల మధ్య పోటీతత్వంతో వారిమధ్య స్నేహం చిగురించకుండా చేస్తారు. చివరికి వాళ్లను అమానుషంగా తయారు చేస్తారు.

ఇప్పుడిదో సోషల్ స్టేటస్!
తమ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసన్ చదవడాన్ని తల్లిదండ్రులు ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. ఫలానా వాళ్ల పిల్లలు ఐఐటీలో చదువుతున్నారని సమాజంలో గొప్పగా చెప్పుకుంటున్న వాతావరణం ఉంది. సమాజంలో ఉపాధి, విద్యావకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిన తర్వాత డిమాండ్ కొంత తగ్గినా, ఐఐటీ కోసం ఇంకా పోటీ పడుతూనేఉన్నారు. చదువంటేనే ఇంజనీరింగ్, మెడిసిన్ అనే స్థాయిలో సమాజం ఉంది. ర్యాంకర్లకు సన్మానాలు, మీడియా ప్రచారం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా అలా చూసుకోవాలనుకుంటున్నారు.

కార్పొరేట్ షెడ్యూల్
ఉదయం 5:00 గంటలకు నిద్రలేవాలె..
కాలకృత్యాలు తీర్చుకుని, టిఫిన్ చేయాలి.
6:00 గంటల నుంచి మధ్యాహ్నం
1:00 గంటల వరకు క్లాసులు
మధ్యాహ్నం 1:00 గం. నుంచి
1.45 గం. వరకు లంచ్ బ్రేక్
మధ్యాహ్నం 1.45 గం. నుంచి సాయంత్రం 5:00 గం. వరకు స్టడీ అవర్స్
సాయంత్రం 5:00 గం. నుంచి 5:45 గం. వరకు బ్రేక్ ఇది అర్థ గంటకు తగ్గించారు.
సాయంత్రం 5:45 గం. నుంచి రాత్రి 10 గం. వరకు స్టడీ అవర్స్
ప్రతి సోమవారం పరీక్ష నిర్వహిస్తారు. వారంలో చెప్పిన పాఠాలన్నింటిలో విద్యార్థి ప్రతిభను ఇందులో పరీక్షిస్తారు. అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు.


పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాం..కానీ..
మా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాం. కార్పొరేట్ జూనియర్ కాలేజీలో చేర్పించాం. పిల్లలకు ఎలా బోధించాలో, ఎలాంటి వసతులు కల్పించాలో అవేవీ అక్కడ లేవు. పిల్లలు చెబితే తెలిసింది. సరే కొద్దికాలం చూడమని చెప్పాం. అయినా అలవాటుకాలేదు. వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుని కాలేజీ యాజమాన్యం అనుమతితో కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉంచాం. మళ్లీ బుజ్జగించి పంపించాం. కానీ అదే పరిస్థితి. అక్కడ మార్కుల కోసం పిల్లల్ని ఎక్కువ గంటలు చదివిండం, ప్రపంచంతో సంబంధంలేకుండా, ఇతరులతో మాట్లాడకుండా చదువు, చదువు అంటూ న్యూనతకు గురి చేయడమే ఉంది. పిల్లల మానసిక స్థితి చూసి మేమూ కంగారుపడ్డాం. మొదటి అంతస్థులో చదువు, రెండోఅంతస్థులో హాస్టల్, మొదటి అంతస్థులో మెస్. ఇదే వాళ్ల ప్రపంచం. మా పిల్లలిద్దర్నీ ఇంటికి తీసుకువచ్చాం. ఇప్పుడు వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు.
- ఎస్.వాసు (పేరెంట్)

ఆ రోజు..సగం మంది ఏడుస్తారు
రోజంతా చదవాల్సిందే. సిక్ అయితే నువ్వు వేస్ట్ అంటారు. అమ్మానాన్నతో ఉండాలనిపించేది. మార్కులు రాకపోతే ఏమంటారో? అని భయపడ్డాను. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లను ఇంకా బాగా చదివితే ర్యాంక్ వస్తుందంటారు. తక్కువ వచ్చిన వాళ్లను ఇలాగేనా చదివేది అంటారు. కొంతమంది మార్కులు రాకపోతే ఏడుస్తున్నారు. రిజల్ట్ పెట్టిన రోజు క్లాస్ రూమ్, బయట పెడతారు. అన్ని క్లాసుల వాళ్లు ఆ మార్క్స్ చూస్తారు. ఆ రోజు సగం మందికిపైగా ఏడుస్తారు. పేరెంట్స్ వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో మార్కులెన్ని, జువాలజీ మార్కులెన్ని అని అడుగుతారు. కానీ టైమ్‌కు తిను, పడుకో, మంచిగా చదువుకో అని చెప్పరు. బయట ఏం జరుగుతుందో తెలియదు. బయటి వాతావరణం చూడాలనిపించేది. కానీ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. బ్రేక్‌లో బయటి వాతావరణ కోసం వస్తాం. కానీ అది రిసెప్షన్‌దాకా పోవడమే. మొదటి వారం ఔటింగ్‌కు పొమ్మన్నారు. రంజాన్ పండుగ రోజు ఇంటికి పోతామన్నా పంపించలేదు. రాఖీ పండుగకూ పంపించలేదు. ఫంక్షన్లున్నా పోకూడదు. నేను ఉండలేను అని మా వాళ్లతో అన్నాను. అప్పటికి రెండు నెలలు క్లాసులు గడిచాయి. ఫీజు ఇంత కట్టారు. మమ్మీవాళ్లు బాధపడతారు. ఫీజు రిటర్న్ ఇవ్వరు అని బాధపడ్డాను. మరోసారి ప్రయత్నం చేయి అని హాస్టల్‌కు పంపారు. వారం రోజులు ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి తీసుకుపోయారు.
- ఓ కాలేజీ నుంచి బటయపడ్డ ఓ విద్యార్థిని

ఇక్కడ చావుల్లేవ్..!
ఇక్కడ చావుల్లేవు. బాధల్లేవు. తమిళనాడులో ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. అందువల్ల ఇక్కడ థియరిటికల్‌గా విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేస్తారు. ప్రాక్టికల్‌గా (బిట్స్‌కి సరైన సమాధానం గుర్తించేలా) బోధించరు. ర్యాంకుల జాడ్యంలేదు. అందువల్ల ర్యాంకుల ప్రచారం ఉండదు. పోటీ అసలే ఉండదు. అందువల్ల కార్పొరేట్ కాలేజీలు లేవు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.
- సతీష్ (నీట్ ఫ్యాకల్టీ), మధురై, తమిళనాడు

1385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles