బ్యాంకుల విలీనం అసమంజసం

Sun,December 16, 2018 07:15 AM

The absorption of banks is unfair says AIBEA

చెన్నై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌ల విలీనం అసమంజసమని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) విరుచుకుపడింది. ఈ మూడు బ్యాంకుల ఏకీకరణను నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంఘం.. విలీనంతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది. పైగా ఆయా బ్యాంక్ ఉద్యోగులకు నష్టం కలుగుతుందని, ఉద్యోగాలు పోయి ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విలీనం బ్యాంకింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలను దెబ్బ తీస్తుంది అని శనివారం ఇక్కడ సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందడం లేదన్న ఆయన బ్యాంకులు విస్తరణ బాట పట్టాలేగానీ.. విలీన బాట పట్టకూడదని వ్యాఖ్యానించారు. విలీనంతో బ్యాంకులు బలోపేతం కాగలవన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్నీ ఈ సందర్భంగా తప్పుబట్టిన ఆయన గతేడాది భారతీయ మహిళా బ్యాంక్, మరో ఐదు అనుబంధ బ్యాంక్‌లను కలిపేసుకున్న ఎస్‌బీఐకి ఏమాత్రం లాభం చేకూరిందని ప్రశ్నించారు.
ఈ 26న దేశవ్యాప్త సమ్మె..
ఆరు బ్యాంకులు కలిసిన తర్వాత ఎస్‌బీఐ మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) మరింత పెరిగి రూ.2.25 లక్షల కోట్లకు చేరాయి అని గుర్తుచేశారు. బ్యాంకుల విలీనం వల్ల శాఖలు మూతబడి ఉద్యోగులు ప్రమాదంలో పడుతారన్నారు. బ్యాంకింగ్ రంగ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న ఎన్‌పీఏలను నివారించేందుకు విలీనం సరికాదన్న వెంకటాచలం.. మొండి బాకీల వసూలుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీవోబీ, దేనా, విజయా బ్యాంక్‌ల మొత్తం నిరర్థక ఆస్తులు రూ.80,000 కోట్లుగా ఉన్నాయన్న ఆయన ఒకవేళ ఈ బ్యాంకులు విలీనమై ఉంటే ఆ బకాయిలు వాటంతటవే వసూలయ్యేవా? అని ప్రశ్నించారు. కాగా, ఈ మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారని వెంకటాచలం ఈ సందర్భంగా తెలియజేశారు.

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles