కోల్కతా: దసరా ఉత్సవాల సమయంలో పశ్చిమ బెంగాల్లో దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేయడం సహజం. చాలా భారీ ఎత్తున ఆ మండపాలను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఆదాయపన్ను శాఖ దుర్గాపూజలు నిర్వహించిన కమిటీలకు నోటీసులు జారీ చేసింది. టీడీఎస్ దాఖలు చేయాలంటూ తమ ఆదేశాల్లో పేర్కొన్నది. దీంతో కోల్కతాలోని పూజ నిర్వాహాక కమిటీలు ఖంగుతిన్నాయి. ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఆ మండపాల నిర్వాహాకులకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఆ నోటీసుల గురించి ఆలోచించ వద్దు అంటూ ఆమె హామీ ఇచ్చారు.
దుర్గా దేవి పూజలను కూడా వదలడం లేదా, ఎన్జీవోలు మండపాలను నిర్వహిస్తాయని, వారికి కూడా నోటీసులు ఇస్తారా, పూజలతో ఆ కమిటీలు లాభాలు పొందవని, అందుకే ఆ మండపాలు ఐటీపన్ను కిందకు రావు అని సీఎం మమతా తెలిపారు. పూజల నిర్వహణ కోసం పౌరులే విరాళం ఇస్తుంటారని, వాటి కోసం కేంద్రం ఒక్క పైసా కూడా చెల్లిందని ఆమె అన్నారు. పూజా కమిటీల నిర్వహణ ఐటీశాఖ కిందకు రావన్నారు. పూజా కమిటీలన్నీ సంఘితంగా ఉండాలని, ఎవరు కూడా ఐటీ శాఖకు బదులు ఇవ్వకూడదని, పూజా కమిటీలను టచ్ చేస్తే ఊరుకునేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి బాలాజీ, గోల్డెన్ టెంపుల్, జగన్నాథ్ ఆలయం, సిద్ధవినాయాక ఆలయం, అజ్మీర్ షెరీఫ్ లాంటి గుళ్ల నుంచి కూడా ఐటీశాఖ పన్నులు వసూల్ చేస్తుందా అని ఆమె ప్రశ్నించారు.