తాజ్‌మహల్‌పై మొఘల్ వంశీయుడి మాట ఇదీ!

Mon,April 16, 2018 04:32 PM

Taj Mahal is Indias Property Sunni Wakf Board has no claim says Mughal Descendent

న్యూఢిల్లీ: తాజ్‌మహల్ మాది అంటూ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో వాదిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆ తాజ్‌మహల్‌ను కట్టిన మొఘల్ వంశానికి చెందిన వైహెచ్ తుసి అనే వ్యక్తి దీనిపై స్పందించాడు. చివరి మొఘల్ చక్రవర్తి బాహదూర్ షా జాఫర్‌కు తాను ముని మనవడినని తుసి చెప్పాడు. తాజ్‌మహల్ భారత్‌కు చెందుతుంది.. సున్నీ వక్ఫ్ బోర్డుకు కాదని అతను స్పష్టంచేశాడు. అంతేకాదు అయోధ్యలో బాబ్రీ మసీదు భూమి కూడా వక్ఫ్ బోర్డుది కాదని తుసి స్పష్టంచేశాడు. తాజ్‌మహల్ దేశ సంపద.. దీనిపై ఎవరికీ హక్కు లేదు అని తుసి తేల్చి చెప్పాడు. షాజహాన్ వక్ఫ్ బోర్డుకు తాజ్‌మహల్ రాసివ్వలేదు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయానికి వస్తే.. అక్కడ కచ్చితంగా మందిరం నిర్మించాల్సిందే. మతాల మధ్య చీలిక తీసుకొస్తున్న ఇలాంటి అంశాలను పరిష్కరించడానికి ఎవరు ముందుకొచ్చినా నేను మద్దతిస్తాను అని తుసి స్పష్టంచేశాడు.

సున్నీ వక్ఫ్ బోర్డు పెద్ద కబ్జాకోరని, వాళ్ల ఆఫీస్‌లో కుర్చీలు, టేబుళ్లు కూడా లేనివాళ్లు తాజ్‌మహల్ నిర్వహణ ఎలా చేస్తారు అని తుసి ప్రశ్నించాడు. వాళ్లు హిందు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తుసి ఆరోపించాడు. మొఘల్ వంశీయుడిగా నేను ఈ ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వానికి రాసిచ్చేస్తాను. ఇప్పటికే దీనిపై నేను వేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది అని ఆయన చెప్పాడు. తాజ్‌మహల్‌పై రాజకీయాలు చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పాడు. ఈ మధ్యే షాజహాన్ ఉర్స్ నిర్వహించి, దానికి ఆరెస్సెస్ కార్యకర్తలను కూడా ఆహ్వానించాడు.

3195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS