రేపే అయోధ్య తుది తీర్పు

Fri,November 8, 2019 09:36 PM

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం తీర్పు వెల్లడించనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు అయోధ్యపై తుది తీర్పు వెలువరించనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే యూపీలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. ఇవాళ ఉదయం యూపీ అధికారులతో సీజేఐ సమావేశమైన విషయం తెలిసిందే.


అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే వివాదాస్పద స్థలం ఉన్న అయోధ్య నగరం మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని స్థానిక హిందువులు, ముస్లింలు స్పష్టం చేస్తున్నారు.

అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. వేడుకలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉన్నది. ఇది డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సందేశాలను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


సుప్రీంకోర్టు తీర్పు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించింది. అయోధ్యలో మోహరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్‌కు అదనంగా నాలుగువేల మంది పారా మిలిటరీ సిబ్బందిని తరలించింది. మరోవైపు అయోధ్య నగరంలో ఉత్కంఠ నెలకొంటున్నది. స్థానికులు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ర్టాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

1107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles