శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ

Thu,November 14, 2019 10:55 AM

న్యూఢిల్లీ : శబరిమల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. శబరిమల వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాలని మెజార్టీ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా? వద్దా? అనే అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీం నిర్ణయించింది. అన్ని వయసుల మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను కోర్టు పెండింగ్ లో ఉంచింది. అయితే ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని సీజేఐ ప్రకటించగా.. ఇందుకు జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకించారు. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ధర్మాసనంలో ముగ్గురు నిర్ణయాన్ని బలపర్చగా.. ఇద్దరు వ్యతిరేకించారు. 3:2 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.


మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ తెలిపారు. ప్రార్థనా స్థలాల్లోకి మహిళల ప్రవేశం ఈ ఆలయానికి మాత్రమే పరిమితం కాదన్నారు. ఈ కేసు ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశం అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోందన్నారు. మత విధానాలనేవి నైతికత, ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండరాదు. మతంలోకి చొచ్చుకునే అధికారం కోర్టులకు ఉందా అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. కీలకమైన మత విధానాలను మతపెద్దలతో చర్చించాలా అనే విషయం నిర్ధారించాలి. మత విశ్వాసాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అనే అంశాన్ని విస్తృత బెంచ్ పరిశీలించాలని మెజార్టీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018, సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ నాయర్‌ సర్వీసెస్‌ సొసైటీ, దేవస్థాన తంత్రులు, ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు సహా పలువురు భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో 65 పిటిషన్లు దాఖలయ్యాయి.

1182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles