
న్యూఢిల్లీ: కతువా రేప్ ఘటనలో జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 8 ఏళ్ల బాధితురాలి తండ్రి దరఖాస్తు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆ రాష్ర్టాన్ని కోరింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ బాధితురాలి తండ్రి తరపున వాదించారు. నిష్పాక్షిక విచారణ కోసం కోర్టు వాతావరణం సరిగాలేదని న్యాయవాది తెలిపారు. పరిస్థితులన్నీ ఒకరి వైపు ఉన్నట్లు జైసింగ్ కోర్టుకు విన్నవించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర పోలీసులు కతువా రేప్ కేసు విచారణలో నిష్పాక్షిక పాత్ర పోషించారని, రేప్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ పోలీసులు అరెస్టు చేశారని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో సాగినట్లు న్యాయవాది జైసింగ్ కోర్టుకు తెలిపారు. అత్యాచార బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోర్టు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో న్యాయవాదులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఇవాళ ఢిల్లీలో లాయర్లు ఆందోళన చేపట్టారు. ఇక ఉన్నావ్‌లో జరిగిన మరో రేప్ ఘటనలో బాధితురాలి నుంచి సీబీఐ అధికారులు సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ తీసుకున్నారు.