లోక్‌స‌భ ఎన్నిక‌లు.. ఫోక‌స్ అంతా సోష‌ల్ మీడియాదే !

Sun,March 10, 2019 07:30 PM

social media to play big role in Lok sabha elections 2019

హైద‌రాబాద్ : ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా ఒక‌ప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు ఇవే అండ‌. ఈ మీడియాను వాడుకునే.. పెద్ద పెద్ద పార్టీలు ఎన్నిక‌ల్లో త‌మ సత్తా చాటేవి. కానీ ఇప్పుడీ వీటి ప్రాముఖ్య‌త త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. ఇప్పుడంతా యాప్ ఏజ్‌. సోష‌ల్ మీడియాదే హ‌వా. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలాంటి ఆన్‌లైన్ సైట్లు అన్నీ ఓట‌రు ఆక‌ర్ష‌క వేదిక‌లుగా మారాయి. ఒక‌ప్పుడు ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ప్ర‌భావానికి లోను చేసిన వాటిల్లో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు ప్ర‌ధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా పాత్ర మాత్రం ఎన‌లేని ఆద‌ర‌ణ చూర‌గొన్న‌ది. ప్ర‌తి పార్టీ, ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు.. త‌మ ఎన్నిక‌ల ఎజెండాను, ప్ర‌ణాళిక‌ల‌ను.. ఇలా అన్నిఅంశాల‌ను సోష‌ల్ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. అది కూడా వేగంగా, అత్యంత సుల‌భంగా. ఒక‌ర‌కంగా సోష‌ల్ మీడియా ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు ఆయుధాలుగా మారాయి. అవి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే శ‌క్తులుగా ఎదిగాయి.

ఇవాళ ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ సునీల్ అరోరా.. లోక్‌స‌భ 2019 షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సోష‌ల్ మీడియా గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించారు. అన్ని సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు న‌కిలీ వార్త‌ల క‌ట్ట‌డి విష‌యంలో ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు. ఆన్‌లైన్ సైట్ల ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించిన నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని హెచ్చ‌రించారు. ఆన్‌లైన్ ప్ర‌చారంపై ప‌టిష్ట‌మైన నిఘా ఉంటుంద‌న్నారు. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌లు ఏడు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. అంటే ఈ ప్ర‌క్రియ కోసం సుమారు రెండు నెల‌ల స‌మ‌యం కేటాయించారు. ఈ ఉత్కంఠ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా పాత్ర విశేషంగా మార‌నున్న‌ది. ప్ర‌తి ఓట‌రును ఆక‌ర్షించే అత్య‌ద్భుత సాధ‌నంగా సోష‌ల్ మీడియా ఎదుగుతున్న‌ది.

ఫోటోలు, వీడియోలు, పార్టీ ప్ర‌క‌ట‌న‌లు, ఎజెండాను చేర‌వేసే విధానం అన్నీ ఓట‌ర్ల‌ను తీవ్ర ప్ర‌భావానికి గురి చేసే అవ‌కాశం ఉంటుంది. సూర్య‌కాంతి క‌న్నా వేగంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌తి వార్త వ్యాపిస్తున్న‌ది. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు మ‌రీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అస‌లు ఈ మీడియాను ఆశ్ర‌యిస్తున్న వారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. ఒక‌ర‌కంగా ఈ మీడియా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచుతూనే .. మ‌రో వైపు ఊహించ‌ని భ‌యాన్ని కూడా క‌లిగిస్తున్న‌ది. న‌కిలీ వార్త‌ల ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో అధికంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ కూడా సోష‌ల్ మీడియా యాజ‌మాన్యాల‌కు హెచ్చ‌రిక‌లూ చేశాయి. ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చాయి.

కానీ ప్ర‌తి ఓట‌రు చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓ ఆయుధంగా మారింది. ప్రింట్‌, టీవీలు వెళ్ల‌లేని చోటుకు.. సోష‌ల్ మీడియా వెళ్లింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఓట‌రు.. ఇప్పుడు ఆన్‌లైన్ ప్ర‌చారంతో తీవ్ర ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో ఎవ‌రు ఎటువంటి సమాచార‌న్ని సంధిస్తారో అర్థం కాని ప‌రిస్థితి త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ది. సోష‌ల్ మీడియా ప్ర‌చారం.. ఓట‌రు ప్ర‌వ‌ర్త‌నను అయోమ‌యంలోకి నెట్టే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అనేక స‌ర్వేల్లోనూ ఇదే నిజ‌మ‌ని తేలింది. ఆన్‌లైన్ ప్ర‌భావానికి ఓట‌రు గురికావ‌డం ఖాయం అని అవి స్ప‌ష్టంగా తేల్చాయి కూడా. అందుకే ఇవాళ ఎన్నిక‌ల సంఘం కూడా త‌న సందేశంలో సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసింది.

ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టి.. త‌మ పార్టీకి మెజారిటీని లాక్కోవాల‌న్న ఉద్దేశంతో ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సేవామిత్ర యాప్‌తో పెను విధ్వంసానికి పాల్ప‌డింది. ఐటీ గ్రిడ్స్ పేరుతో ఆంధ్ర ఓట‌ర్ల‌ను వంచించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ తెలంగాణ పోలీసులు అప్ర‌మ‌త్త వ‌ల్ల ఆ కుటిల ఎత్తు బ‌య‌ట‌ప‌డింది. కానీ ఇలాంటి అనుచిత రాజ‌కీయాలు ఇప్పుడు మ‌రింత ప‌దునెక్కే అవ‌కాశాలు ఉన్నాయి. ఓట‌ర్ల‌ను మెప్పించే క్ర‌మంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అక్ర‌మ విధానాల‌ను అవ‌లంబించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో పెయిడ్ న్యూస్ జ‌రిగితే, వాటి వివ‌రాలు ఇవ్వాల‌ని ఇవాళ ఈసీ వెల్ల‌డించింది. గూగుల్‌, ఫేస్‌బుక్ కూడా పొలిటిక‌ల్ యాడ్స్‌ను మానిట‌ర్ చేయాల‌ని ఆదేశించింది. కానీ చాలా సున్నితంగా మారిన సోష‌ల్ మీడియా.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ది. ట్విట్ట‌ర్, ఎఫ్‌బీ, వాట్సాప్ ప్ర‌ధాన అస్త్రాలుగా మార‌నున్నాయి.

1560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles