వేడెక్కిన అయోధ్య‌.. రాముడిని దర్శించుకున్న ఉద్ధవ్ థాక్రే

Sun,November 25, 2018 11:08 AM

అయోధ్య: రామ జన్మభూమి మరోసారి వేడెక్కింది. రామ మందిరం నిర్మించాలంటూ ఇటు శివసేన అయోధ్య ర్యాలీ చేపట్టగా, అటు వీహెచ్‌పీ ధర్మ సభను నిర్వహిస్తున్నది. శనివారమే అయోధ్య చేరుకున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆదివారం ఉదయం వివాదాస్పద రామ జన్మభూమికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు రామ్ రామ్ అనే జపించే పార్టీలు.. ఎన్నికల తర్వాత ఆరామ్ అయిపోతాయని ఆయన విమర్శించారు. వీహెచ్‌పీ ధర్మసభ ప్రారంభానికి ముందే థాక్రే ఈ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మరోవైపు ఈ సభలో పాల్గొనడానికి లక్షల మంది రామ భక్తులు అయోధ్యకు పోటెత్తారు. దీంతో యూపీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సభకు 3 లక్షలకుపైగా భక్తులు తరలి వస్తారని వీహెచ్‌పీ ప్రకటించింది. రామ మందిర నిర్మాణానికి ముందు ఇదే చివరి ధర్మ సభ కానుందని వీహెచ్‌పీ నేత భోలేంద్ర స్పష్టం చేశారు. ఈ సభ ముగిసిన తర్వాత ఇక సభలు ఉండవని, మందిర నిర్మాణం ప్రారంభం అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు ఈ రామ మందిర నిర్మాణంపై యోగా గురు రాందేవ్ బాబా స్పందించారు. రోడ్లు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్‌ల కోసం భూమిని సేకరించినప్పుడు రామ మందిరం కోసం ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు.


1458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles