ప్రధానికి అప్పుడే మోసగాళ్ల జాబితా పంపాను.. బాంబు పేల్చిన రఘురాం రాజన్!

Tue,September 11, 2018 05:41 PM

Sent high profile fraudsters list to PMO but no action from them says Raghuram Rajan

న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పెద్ద బాంబే పేల్చారు. తాను గవర్నర్‌గా ఉన్నపుడే కొందరు ప్రముఖుల మోసాల కేసుల జాబితాను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించానని, అయినా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్‌జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌కు ఇచ్చిన నివేదికలో రాజన్ ఈ ఆరోపణలు చేశారు. బ్యాంకుల అత్యాశ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వృద్ధి నెమ్మదించడం మొండి బకాయిలు పేరుకుపోవడానికి ప్రధాన కారణమని రాజన్ ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. నేను గవర్నర్‌గా ఉన్న సమయంలోనే మోసాల పర్యవేక్షణ కోసం ఓ సెల్‌ను ఏర్పాటుచేశారు. దీనిద్వారా మోసపూరిత వ్యక్తుల వివరాలను సాధ్యమైనంత త్వరగా విచారణ సంస్థలకు ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. నేను కూడా పీఎంవోకు మోసపూరితమైన ప్రముఖల జాబితాను పంపించాను. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై అర్జెంటుగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది అని రాజన్ అన్నారు.

మోసానికి పాల్పడిన ఒక్క ప్రముఖుడినైనా పట్టుకోలేకపోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆయన స్పష్టంచేశారు. దీని ఫలితంగానే మోసాలు ఆగలేదని రాజన్ చెప్పారు. ఆర్బీఐ మాజీ గవర్నరే ప్రధానిని, ఆయన కార్యాలయాన్ని తప్పుబట్టారని, ఇంతకన్నా ఏం కావాలని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడంతోపాటు ప్రభుత్వానికి వాటిని దూరంగా ఉంచాలని కూడా రాజన్ తన నివేదికలో సిఫారసు చేశారు. ఆర్థిక వృద్ధి దూసుకెళ్తున్న 2006-08 మధ్య కాలంలోనే ఈ మొండి బకాయిలు పెరిగిపోయాయని కూడా ఆయన చెప్పారు.

3790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles