వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ

Thu,March 1, 2018 10:36 PM

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)తో పాటు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకునేవారు ఇప్పటివరకూ ఉన్న వడ్డీ కంటే అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో నగదు లభ్యత లేదా సరఫరా కఠినంగా మారిన తరుణంలో బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్న ఎస్‌బీఐ.. ప్రస్తుతం 7.95 శాతంగా ఉన్న నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 20 బేసిస్ పాయింట్లు (8.15 శాతానికి) పెంచుతున్నామని, మార్చి 1వ తేదీ నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2016 ఏప్రిల్ తర్వాత ఎస్‌బీఐ తమ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. రిటైల్ డిపాజిట్లతో పాటు బల్క్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచుతున్నట్లు ఎస్‌బీఐ బుధవారం ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ బ్యాంకు నిధుల వ్యయం ఆధారంగా రుణ రేట్లను నిర్ణయిస్తున్నది. అంటే నిధులు సమీకరించుకునేందుకు బ్యాంకు చేసే వ్యయం ఏమాత్రం పెరిగినా.. దాని ప్రభావం రుణ రేట్లపై కూడా పడుతుందన్నమాట. ఎస్‌బీఐ మాదిరిగా ఐసీఐసీఐ, పీఎన్‌బీ కూడా తమ ఎంసీఎల్‌ఆర్ రేట్లను పెంచాయి. అయితే ఈ రెండు బ్యాంకుల పెంపుదల 20 బేసిస్ పాయింట్లు కాకుండా 15 బేసిస్ పాయింట్లకు మాత్రమే పరిమితమైంది. ఇకమీదట పురుషులకు 8.6 శాతం వడ్డీతోనూ, మహిళలకు 8.55 శాతం వడ్డీతోనూ గృహ రుణాలు అందజేయనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించగా, ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఎంసీఎల్‌ఆర్‌ను 7.8 శాతం నుంచి 7.95 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ, మరికొన్ని ఇతర బ్యాంకులు వచ్చే వారం తమ రుణ రేట్లను పెంచబోతున్నట్లు తెలుస్తున్నది.

1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles