
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను మించిపోయి దేశంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. మంగళవారం కంపెనీ షేరు ధర పెరగడంతో రిలయన్స్ సంస్థ విలువ 7 లక్షల 46 వేల 472 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు ధర 2.51 శాతం పెరిగి రూ.1178.55కు చేరింది. కంపెనీ చరిత్రలో అత్యధిక త్రైమాసిక నికర లాభాలు చూపించడంతో రిలయన్స్ షేర్ల ధర భారీగా పెరిగిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.8021 కోట్లు కాగా.. ఈ ఏడాది అది రూ.9459 కోట్లకు చేరింది.
అంటే గతేడాది కంటే 17.9 శాతం లాభాలు పెరిగాయి. సంస్థ ఆదాయం 56.5 శాతం పెరిగి 1,41,699 కోట్లకు చేరింది. జులై 13న తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. టీసీఎస్ తర్వాత రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను రెండోసంస్థగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే నెలలోనే టీసీఎస్ 7 లక్షల కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం.