రాజధానికి 50 ఏళ్లు.. ప్రయాణికులకు రసగుల్లాలు

Mon,March 4, 2019 12:21 PM

Rajadhani Express celebrating Golden Jubilee

కోల్‌కతా: వేగం, విలాసాల్లో ఇండియన్ రైల్వేస్ దశ, దిశను మార్చేసిన రాజధాని ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1960ల్లో తొలిసారి పట్టాలెక్కిన ఈ ఎక్స్‌ప్రెస్ ఆదివారం తన గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. 50వ ఏట అడుగుపెట్టిన రోజు హౌరా నుంచి బయలుదేరింది. తొలిసారి కోల్‌కతా-న్యూఢిల్లీ మధ్య 1969, మార్చి 3న రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైనట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి వెల్లడించారు. దేశంలోని పూర్తి ఎయిర్‌కండిషన్డ్, హైస్పీడ్ ట్రైన్‌గా అప్పట్లో ఇది నిలిచింది. 1450 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 20 నిమిషాల్లో చేరుకోవడం విశేషం. ఆదివారం హౌరా నుంచి రైలు బయలుదేరే ముందు దానిని పూలతో అందంగా ముస్తాబు చేశారు. గతంలో ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన ముగ్గురు మాజీ సిబ్బంది జెండా ఊపారు.

కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి హౌరా స్టేషన్‌లోని 9వ నంబర్ ప్లాట్‌ఫాంపైనే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలబెడుతున్నారు. ఆదివారం కూడా అదే ప్లాట్‌ఫాం నుంచి ఆ రైలు బయలు దేరింది. ఈ గోల్డెన్ జూబ్లీ ప్రయాణంలో పాలుపంచుకున్న ప్యాసెంజర్లకు రైల్వే శాఖ ప్రత్యేక వంటకాలు చేసి పెట్టింది. రసగుల్లాలు, ఐస్‌క్రీమ్‌లతోపాటు ఫిష్ ఫ్రై, వెజిటబుల్ కట్లెట్స్‌లాంటి సాంప్రదాయ నోరూరే వంటకాలను వడ్డించారు. తొలిసారి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోనే రైలు టికెట్‌తోపాటు భోజనానికి కూడా చార్జీ వసూలు చేశారు. రైల్లోని సిబ్బంది గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ప్రత్యేకమైన యూనిఫామ్‌లు ధరించారు.

1953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles