పోక్సో చట్ట సవరణకు ప్రతిపాదనలు

Sun,July 22, 2018 09:38 PM

Protection of Children from Sexual Offences Act, 2012 Proposals for modification

న్యూఢిల్లీ : చిన్నారులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కృషిచేస్తున్న కేంద్ర మహిళా, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ మరో సరికొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. మగ పిల్లలపై లైంగికంగా దాడిచేసేవారికి మరణశిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చేందుకు చేసిన ప్రతిపాదనలను పరిశీలన నిమిత్తం వచ్చేవారం క్యాబినెట్ ముందుంచనున్నారు. ఈ మేరకు పోక్సో చట్టం-2012 కు సవరణలు చేపట్టేందుకు ఇప్పటికే కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. 18 ఏండ్ల లోపు వయసున్న బాలలపై హద్దుమీరుతున్న లైంగిక దాడులను అడ్డుకునేందుకు 2012 లో పోక్సో చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నా చిన్నారులపై అఘాయిత్యాలను మాత్రం నిలువరించలేకపోతున్నారు.

ఇటీవలికాలంలో మగపిల్లలపై లైంగికదాడులు జరుగుతుండటంతో.. కేంద్ర మహిళా, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ కఠిన చర్యలు తీసుకొనేలా చట్టంలో మార్పులకు ప్రతిపాదనలు తయారుచేసింది. 12 ఏండ్లలోపు బాలురపై లైంగికదాడికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా పోక్సో చట్టం-2012లో మార్పులు చేయాలని కేంద్ర మంత్రి మేనకాగాంధీ సూచించినట్టుగా తెలుస్తున్నది. బాలురపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సినీ నిర్మాత, హక్కుల కార్యకర్త కూడా అయిన ఇన్సియా దారివాలా ఇటీవల ఓ పిటిషన్‌ను చేజ్ డాట్ ఓఆర్జీకి పంపడంతో.. కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఈ విషయంపై దృష్టిసారించి చట్టంలో సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.

853
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS