ప్రియాంకా గాంధీ అరెస్టు

Fri,July 19, 2019 12:50 PM

Priyanka Gandhi arrested in Uttar Pradesh

హైద‌రాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో గ‌త బుధ‌వారం ఓ భూవివాదం కేసులో ప‌ది మందిని కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అక్క‌డ‌కు వెళ్లారు. అయితే ఆమెను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కేవ‌లం న‌లుగురు వ్య‌క్తుల‌తో మాత్ర‌మే మాట్లాడుతా అని చెప్పినా.. త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని ప్రియాంకా అన్నారు. త‌మ‌ను ఎందుకు అడ్డుకున్నారో ప్ర‌భుత్వం చెప్పాల‌న్నారు. మొద‌ట ప్రియాంకా శాంతియుత ధ‌ర్నాకు కూర్చున్నారు. నారాయ‌ణ్‌పూర్ ప్రాంతంలో ఆమెను అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం సోన్‌భ‌ద్ర‌లో 144 సెక్ష‌న్ విధించారు. త‌న‌ను ఎక్క‌డ‌కు తీసుకువెళ్తున్నారో త‌న‌కు తెలియ‌ద‌ని, ఎక్క‌డికి వెళ్లేందుకైనా తాను సిద్ధ‌మే అని ప్రియాంకా అన్నారు. ఇదే అంశంపై సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఇవాళ మాట్లాడారు. ఈ కేసుకు సంబంధం ఉన్న 29 మందిని అరెస్టు చేశామ‌న్నారు. సింగిల్ బ్యారెల్ గ‌న్‌, మూడు డ‌బుల్ బ్యారెల్ తుపాకులు, ఓ రైఫిల్‌ను సీజ్ చేశామ‌ని సీఎం చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. యూపీ అసెంబ్లీ కూడా ఇవాళ‌ ఇదే అంశంపై వాయిదా ప‌డింది.
సోన్‌భద్ర జిల్లాలోని ఘోరావల్‌ ప్రాంతంలో సాపాహి గ్రామ సర్పంచ్‌ యజ్ఞదత్‌ 90 బిగాలు (36 ఎకరాలు) వ్యవసాయ భూమిని రెండేండ్ల క్రితం ఓ ఐఏఎస్‌ అధికారి నుంచి కొనుగోలు చేశాడు. గత కొంతకాలంగా ఈ భూమిపై వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో బుధవారం నాడు సదరు భూమిని స్వాధీనం చేసుకునేందుకు యజ్ఞదత్‌ తన అనుచరులతో ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో యజ్ఞదత్‌ అనుచరులు గ్రామస్థులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన యజ్ఞదత్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, భూమిని జప్తు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. యజ్ఞదత్‌ మేనల్లుళ్లు గిరిజేశ్‌, విమలేశ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సదుపాయం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ కుమార్‌ అగర్వాల్‌ను ఆదేశించారు. కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించినట్టు ఓ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకోవడంతో పాటు 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని మీర్జాపూర్‌ కమిషనర్‌, వారణాసి జోన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ను కూడా ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles