ప్ర‌ణ‌య్‌రాయ్ 48 కోట్లు ఎగ్గొట్టారా !

Mon,June 5, 2017 01:34 PM

Prannoy Roy causes a loss of Rs 48 crore to ICICI Bank

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ టెలివిజ‌న్ (ఎన్డీటీవీ) స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌ణ‌య్ రాయ్ ఇండ్ల‌పై ఇవాళ సీబీఐ దాడులు చేస్తున్న‌ది. ఢిల్లీతో పాటు డెహ్రాడూన్‌లో ఉన్న ఆయ‌న నివాసాల‌పై ఆ సోదాలు జ‌రుగుతున్నాయి. ఐసీఐసీఐ ప్రైవేటు బ్యాంక్‌కు న‌ష్టం క‌లిగించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ త‌నిఖీలు చేస్తున్న‌ది. ప్ర‌ణ‌య్ రాయ్‌తో పాటు ఆయ‌న భార్య రాధిక‌, ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ వ‌ల్ల ఐసీఐసీఐ బ్యాంకు సుమారు 48 కోట్ల న‌ష్టం వ‌చ్చింది. ఇదే కేసులో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఢిల్లీ, డెహ్రాడూన్ల‌లో మొత్తం నాలుగు చోట్ల త‌నిఖీలు చే్స్తున్న‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది. ద‌క్షిణ ఢిల్లీలో ఉన్న గ్రేట‌ర్ కైలాశ్ రెసిడెన్స్‌లో ఇవాళ ఉద‌యం నుంచి సుమారు ఏడుగురు స‌భ్యుల సీబీఐ బృందం దాడులు కొన‌సాగిస్తున్న‌ది.

రాజ్య‌స‌భ ఎంపీ డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్య‌ స్వామి గ‌త ఏడాది ఎడ్డీటీవీపై ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఎన్డీటీవీ మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఓ లేఖ‌లో ఆరోపించారు. ప్ర‌తి ఒక్క‌రు చ‌ట్టం ముందు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉండాల‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఈ సంద‌ర్భంగా చెప్పారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద ఎన్డీటీవీపై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ ఎంపీ ప్ర‌ధానిని కోరారు. గ‌తంలో ఎన్డీటీవీలో ప‌నిచేసిన జ‌ర్న‌లిస్టు అజ‌య్ శుక్లా ఇవాళ జ‌రిగిన దాడుల విష‌యాన్ని మొద‌ట బ‌య‌ట‌పెట్టారు.

గ‌త కొన్నేళ్లుగా ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న లావాదేవీల‌పై ప్ర‌భుత్వం నిఘా పెట్టింది. దీనికి సంబంధించి డిసెంబ‌ర్ 2015లో ఈ వార్త కూడా ప్ర‌చురిత‌మైంది. ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న లావాదేవీల్లో లోపాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఒక‌వేళ ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మైతే ఆ సంస్థ ప్ర‌తిష్ట దిగ‌జారే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. 2009లో టెలివిజ‌న్ కంపెనీ ఓన‌ర్లు మారిన‌ప్పుడు ఆ సంస్థ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డాన్ని సెబీ త‌ప్పుప‌ట్టింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు వివ‌రాలు వెల్ల‌డించ‌ని కార‌ణంగా ఆ సంస్థ‌పై సెబీ రెండు కోట్ల జ‌రిమానా కూడా విధించింది. ఎన్డీటీవీ ప్రాఫిట్‌ను మూసివేస్తున్న‌ట్లు ఇటీవ‌ల ఆ సంస్థ పేర్కొన్న‌ది. దాని స్థానంలో ఎన్డీటీవీ ప్రాఫిట్‌ను తీసుకురానున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇవాళ జ‌రిగిన సీబీఐ సోదాలను ఎన్డీటీవీ ఖండించింది. సీబీఐ త‌మ‌ను వేధిస్తున్న‌ట్లు ఆ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై త‌మ‌ను వెంటాడుతున్నార‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. వివిధ ఏజెన్సీలు త‌మ ప‌ట్ల సాగిస్తున్న వేట‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు ఎన్డీటీవీ చెప్పింది.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles