మోదీ చెప్పిన ఆపరేషన్ శక్తి ఏంటి.. మీ ప్రశ్నలకు ఇవీ సమాధానాలు!

Wed,March 27, 2019 05:13 PM

PMO answers all your questions on Mission Shakti

న్యూఢిల్లీ: ఓ ముఖ్యమైన సందేశం ఇవ్వాల్సి ఉందంటూ ముందుగా ప్రకటించి మరీ బుధవారం ఆపరేషన్ శక్తి గురించి వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతరిక్షంలోని శాటిలైట్‌ను కూల్చే టెక్నాలజీని ఇండియా సమకూర్చుకున్నదని, ఈ ఘనత సాధించిన నాలుగో దేశం ఇండియా అనీ మోదీ ప్రకటించారు. ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సమాచారంతో మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

అసలేంటీ పరీక్ష?


మార్చి 27, 2019న భారత్ మిషన్ శక్తిని నిర్వహించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇదో యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్. డీఆర్డీడీవో ఆధ్వర్యంలో జరిగిన మిషన్ ఇది. తక్కువ భూకక్ష్యలో తిరుగుతున్న భారత్‌కు చెందిన శాటిలైట్‌నే ప్రయోగం కోసం లక్ష్యంగా చేసుకున్నారు. అనుకున్నట్లే ఈ మిషన్ విజయవంతంగా పూర్తయింది. అత్యంత కచ్చితత్వం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు కావాల్సి ఉంటుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తయారు చేశారు. అంతరిక్షంలో నిఘా వేసే శత్రు దేశ శాటిలైట్లను ఇది పేల్చేయగలదు. ఈ మిషన్ ద్వారా అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలిచింది.

కైనటిక్ కిల్ అనే టెక్నాలజీ ఎందుకు వాడారు?


ఈ మిషన్ కోసం డీఆర్డీవో రూపొందించిన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్‌ను వాడారు. ఇక ఏశాట్ కోసం ైఫ్లె-బై టెస్టులు, జామింగ్‌లాంటి టెక్నాలజీలు ఉన్నా కూడా ఇండియా మాత్రం కైనెటిక్ కిల్ అనే టెక్నాలజీనే వాడింది. దీనికి ఓ కారణం లేకపోలేదు. అంతరిక్ష సాంకేతికతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ తాజా టెక్నాలజీ ద్వారానే ఇండియా ఈ సామర్థ్యం సాధించింది. మిషన్ విజయవంతం కావడానికి కావాల్సిన అన్ని లక్ష్యాలను ఈ టెక్నాలజీ సాధించగలదని విశ్వసించిన తర్వాతే దీనిని వాడారు. ఇక ప్రయోగం కోసం లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న శాటిలైట్‌ను పేల్చడం వల్ల అంతరిక్షంలో ఎలాంటి చెత్తా పేరుకుపోకుండా చూశారు. కొన్ని వారాల వ్యవధిలో ఆ ధ్వంసమైన శాటిలైట్ శకలాలు భూమిపై పడతాయి.

అసలెందుకీ పరీక్ష?


అంతరిక్షంలో భారత ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఈ మిషన్ శక్తి నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా అంతరిక్షంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి భారత్ ఎన్నో ప్రయోగాలు నిర్వహించింది. ఎన్నో శాటిలైట్లను కక్ష్యలోకి పంపించింది. మంగళ్‌యాన్ పేరుతో మార్స్‌పైకి రోవర్‌ను పంపడంతోపాటు ఇప్పుడు గగన్‌యాన్ మిషన్ పేరుతో మనిషిని అంతరిక్షంలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నది. దేశ రక్షణ, ఆర్థిక, సామాజిక అవస్థాపనలకు ఈ అంతరిక్ష ప్రయోగాలు ఎంతో కీలకం. అందువల్ల అంతరిక్షంలోని మన ఆస్తులను కాపాడుకోవమూ అంతే ముఖ్యం. వాటికి ముప్పు వాటిల్లే ప్రమాదాలను ముందుగా గుర్తించి నివారించడమే ఈ మిషన్ శక్తి ఉద్దేశం.

ఏ దేశానికైనా వ్యతిరేకంగా ఈ పరీక్ష జరిగిందా?


లేదు. ఈ మిషన్ ఏ దేశానికీ వ్యతిరేకంగా జరగలేదు. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోవడం భారత్ ఉద్దేశం కాదు. పెరిగిపోతున్న సాంకేతికత నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త కొత్త ముప్పులు వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంది. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ నుంచి మన అంతరిక్ష సంపదను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్‌ను భారత్ నిర్వహించింది.

2368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles