రైతన్నలకు నూతన జనసత్వాలు అందిస్తాం : మోదీ

Sat,January 12, 2019 02:50 PM

PM Narendra Modi at BJP National Convention in Delhi

న్యూఢిల్లీ : దశాబ్దాల నిర్లక్ష్యంతో వ్యవసాయం, రైతులు కుదేలైపోయారు అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ రైతన్నలకు నూతన జనసత్వాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాల్వ నీరు రైతు పొలంలోకి వచ్చినప్పుడు ఫలితం వస్తోందన్నారు. ఒకటిన్నర రెట్లకు ఆదాయం లభించనప్పుడే రైతు చిరునవ్వుతో ఉంటాడు అని పేర్కొన్నారు. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. రైతు ఆదాయం రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

బలీయశక్తిగా బీజేపీ
బీజేపీ కార్యకర్తలంతా సుశిక్షుతులు, సంస్కారవంతులు అని పేర్కొన్నారు. అటల్ జీ లేకుండా జరుగుతున్న మొదటి జాతీయ సమ్మేళనం ఇది అని గుర్తు చేశారు. పైనుంచి ఆయన ఆశీస్సులు బీజేపీ కార్యకర్తలందరికీ ఉంటాయన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాల పునాదులపై బీజేపీ బలీయశక్తిగా ఎదిగిందన్నారు. జనం ఆకాంక్షల ప్రతినిధిగా బీజేపీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. స్వాతంత్య్రానంతరం పటేల్ ప్రధాని అయి ఉంటే దేశ స్థితి మరోలా ఉండేదన్నారు. ఆనాడు ఆయన ప్రధాని అయితే ఇప్పుడు దేశం మరెక్కడో ఉండేదని మోదీ పేర్కొన్నారు.

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ బీజేపీ లక్ష్యం
యూపీఏ పదేళ్ల పాలనలో పూర్తిగా అవినీతితో సాగితే.. తమ నాలుగున్నరేళ్ల పాలనలో అవినీతికి తావులేకుండా పరిపాలనను అందించామని మోదీ తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అన్నది బీజేపీ లక్ష్యమన్న మోదీ.. ఆ లక్ష్యంగానే నిరంతర కృషి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్నది కేవలం సర్కార్ వల్లే సాధ్యం కాదు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అందరి అభివృద్ధి సాకారమౌతోందన్నారు. 10 శాతం ఈబీసీల రిజర్వేషన్లు నవ భారతం విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నారు. సామాజిక న్యాయం దిశగా ఈబీసీల రిజర్వేషన్లు చారిత్రక ప్రయత్నమని మోదీ చెప్పారు. అందుకోసం మొదటిసారి ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈబీసీలకు 10 శాతం కోటా కల్పించామని తెలిపారు. ఈ నిర్ణయంతోనే సమస్య మొత్తం పరిష్కారమవుతోందని చెప్పలేను.. కానీ ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. కొంతమంది కావాలని కోటాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారివి వృథా ప్రయాసలు అని అన్నారు.

ఈ దేశ యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎంతో పని చేయాలని మోదీ సూచించారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేస్తోందని మోదీ తెలిపారు. అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు భారత యువత సొంతమని చెప్పారు. ఈ దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులు యువతకు తెలుసన్నారు మోదీ.

3074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles