రాఫేల్ డీల్‌ను మోదీ నాశ‌నం చేశారు : రాహుల్ గాంధీ

Wed,January 2, 2019 03:08 PM

PM Modi destroyed entire Rafale deal, alleges Rahul Gandhi in Lok sabha

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు అంశంపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. రాఫేల్ అంశంపై గోవా మంత్రి రాణే ఆడియో టేపును రాహుల్ స‌భ‌లో వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ మ‌హాజ‌న్ మైక్‌ను రెండు సార్లు క‌ట్ చేశారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన ర‌హ‌స్యా ద‌స్తావేజులు గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇంట్లో ఉన్న‌ట్లు ఆ ఆడియో టేపులో ఉంద‌ని ఇవాళ ఉద‌య‌మే కాంగ్రెస్ ఆరోపించింది. రాఫెల్ క‌థ‌కు ఎన్నో రంథ్రాలు ఉన్నాయ‌ని, ప్ర‌ధాని క‌నీసం 5 నిమిషాలు కూడా రాఫెల్ గురించి మాట్లాడ‌లేద‌ని, అందుకే ప్ర‌ధాని పార్ల‌మెంట్‌కు రావ‌డం లేద‌ని రాహుల్ అన్నారు. యావ‌త్ దేశం రాఫేల్ అంశంపై ప్ర‌ధానిని ప్ర‌శ్నిస్తోంద‌ని కాంగ్రెస్ నేత తెలిపారు.

36 యుద్ధ విమానాల కోన‌గోలు కోసం చేప‌ట్టిన కొత్త డీల్.. అన్ని నిబంధ‌న‌లను తొక్కేసింద‌ని రాహుల్ విమ‌ర్శించారు. రాఫేల్ విమానాల ధ‌ర 526 కోట్ల నుంచి 1600 కోట్ల‌కు ఎలా చేరింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాఫేల్ ధ‌ర పెర‌గ‌డాన్ని ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ వ్య‌తిరేకించిన విష‌యం వాస్త‌వం కాదా అని రాహుల్ అడిగారు. పైస‌ల కోస‌మా లేక దేశ‌భ‌క్తి కోసం ఇలా చేశారా అని రాహుల్ విమ‌ర్శించారు. హెచ్ఏఎల్ ఎన్నో ఏళ్ల నుంచి విమానాల‌ను త‌యారు చేస్తోంద‌ని, అయితే ఎందుకు ప్ర‌ధాని త‌న మిత్రుడికి కాంట్రాక్టు అప్ప‌గించార‌ని, ముడుపుల కోసం ఎందుకు మోదీ ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. రాఫేల్ విమానాలు అత్య‌వ‌స‌రం అని అన్నారు, కానీ ఇంత వ‌ర‌కు ఒక్క విమానాన్ని కూడా ఎందుకు తీసుకురాలేద‌న్నారు.

రాఫేల్ డీల్‌పై గోవా మంత్రి రాణే మాట్లాడిన ఫోన్ కాల్‌ను స‌భ‌లో వినిపించేందుకు రాహుల్ ప్ర‌య‌త్నించారు. టేపుల‌ను వినిపించేందుకు అనుమ‌తి కావాల‌ని కోరారు. దాన్ని స్పీక‌ర్ మ‌హాజ‌న్ అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆర్థిక మంత్రి జైట్లీ జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ త‌ప్పుడు టేపుల‌ను సృష్టించింద‌ని, ఆ రికార్డుల‌ను స‌భ‌లో వినిపించ‌లేమ‌ని జైట్లీ అన్నారు.

గోవా మంత్రి రాణే టేపు గురించి స‌భ‌లో మాట్లాడ‌రాదు అని స్పీక‌ర్ కోరారు. త‌న ప్ర‌సంగంలో అనిల్ అంబానీ పేరును ప్ర‌స్తావించ‌రాదు అని కూడా రాహుల్‌ను స్పీక‌ర్ కోరారు. రాఫేల్ కొనుగోలుపై జేపీసీ వ‌ద్దు అని, పార్ల‌మెంట్ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని సుప్రీం వెల్ల‌డించ‌లేద‌ని, ఆ డీల్ గురించి నిజం తెల‌వాల‌ని రాహుల్ గాంధీ తెలిపారు. పారిక‌ర్ పేరును ప్ర‌స్తావించిన స‌మ‌యంలో.. ఆయ‌న్ను గోవా సీఎం అన‌రాదు అని, మాజీ ర‌క్ష‌ణ మంత్రి అని సంబోధించాల‌ని స్పీక‌ర్ తెలిపారు. తామేమీ భ‌య‌ప‌డ‌డం లేద‌ని, రాఫేల్‌పై జేపీసీ వేయాల‌ని, రాఫేల్ డీల్‌ను మోదీ నాశ‌నం చేశార‌ని, ఆ నిజం బ‌య‌ట‌కు రావాల‌ని, దేశ‌మంతా మోదీని నిందిస్తున్న‌ద‌ని రాహుల్ విమ‌ర్శించారు. అంత‌కుముందు రాహుల్‌ న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పారు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles