HomeLATEST NEWSPM Modi became mouni baba, alleges congress party over Bhima-Koregaon issue

మహారాష్ట్ర అల్లర్లపై స్తంభించిన పార్లమెంట్

Published: Wed,January 3, 2018 01:01 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
న్యూఢిలీ: భీమా కోరేగావ్ అల్లర్ల అంశం ఇవాళ లోక్‌సభలో దుమారం రేపింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తింది. దేశంలో దళితులను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. మహారాష్ర్టాతో పాటు రోహిత్ వేముల ఘటనను ఆయన గుర్తు చేశారు. ఆత్మగౌరవంతో దళితులు బ్రతకాలని భావిస్తున్నప్పుడు, కొందరు వారిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. భీమా కోరేగావ్‌లోనూ ఇదే జరిగిందన్నారు. ప్రతి ఏడాది దళితులు భీమా కోరేగావ్ స్మారకం వద్ద నివాళి అర్పిస్తారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి హింస చోటుచేసుకోలేదని ఖర్గే అన్నారు. హింసను ఎవరు ప్రేరేపించారని ఆయన ప్రశ్నించారు. దళితులు అప్పటి యుద్ధంలో ఆయుధాలు వాడలేదని, ఆ స్మారకం కేవలం చరిత్ర ఆధారంగా నిర్మించారని ఖర్గే తెలిపారు. హింసకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే కారణమని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జి చేత భీమా కోరేగావ్ అల్లర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటన పట్ల సభలో ప్రకటన చేయాలన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే ఆయన మౌనంగా ఉంటారని కూడా విమర్శించారు. ప్రధాని ఓ మౌన బాబాగా మారారని ఖర్గే ఆరోపించారు.

ఈ సమయంలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ జోక్యం చేసుకున్నారు. మహారాష్ట్ర ఘటనను ఖర్గే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలోనూ విఫలమవుతున్నదని, అందుకే ఈ అంశాన్ని ప్రజ్వలింప చేస్తున్నదని విమర్శించారు. విభజించి, పాలించు అన్న విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని మంత్రి అనంత్‌కుమార్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది.

తృణామూల్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా భీమా కోరేగావ్ సమస్యను సభలో లేవనెత్తారు. హింసను ఖండిస్తున్నామన్నారు. అల్లర్లను, హింసను అదుపు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. శివసేనకు చెందిన శివాజీ పాటిల్ కూడా మాట్లాడారు. సంఘటనను మరాఠా వర్సెస్ దళిత్ యుద్ధంగా చిత్రీకరిస్తున్నారని, కానీ అది తప్పు అని ఎంపీ శివాజీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కప్పిపుచ్చేందుకే అల్లర్లను హైలైట్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధాన్వే తెలిపారు. భీమా కోరేగావ్ అంశాన్ని కూడా విపక్షాలు రాజ్యసభలో ప్రశ్నించాయి. దీంతో సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2811
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology