పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయ్!

Thu,February 1, 2018 03:18 PM

న్యూఢిల్లీః పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుంగిపోతున్న సామాన్యుడికి ఊరట కలిగించే ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇవాళ బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు జైట్లీ స్పష్టంచేశారు. అన్ బ్రాండెడ్ పెట్రోల్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.6.48 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. ఇప్పుడు దానిని రూ.4.48కి తగ్గించారు. బ్రాండెడ్ పెట్రోల్‌పై రూ.7.66గా ఉన్న డ్యూటీని రూ.5.66కు తగ్గించారు. అటు అన్‌బ్రాండెడ్ డీజిల్‌పై రూ.8.33గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రూ.6.33కి తగ్గించగా.. బ్రాండెడ్ డీజిల్‌పై రూ.10.69గా ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.8.69కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హైని తాకుతున్న విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, నోయిడాలలో పెట్రోల్ రూ.80ని తాకింది. డీజిల్ ధర రూ.68.17గా రికార్డయింది. నెల రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. గతేడాది అక్టోబర్‌లోనూ ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.2 తగ్గించిన విషయం తెలిసిందే. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మాత్రం ఇప్పటివరకు ఆర్థిక మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

4053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles