
ముంబై : భీమా కోరేగావ్ యుద్ధం జరిగి నేటికి 201 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా యుద్ధం జరిగిన స్థలంలో ఏర్పాటు చేసిన విజయ్ స్తంభం వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహారాష్ట్ర పుణెలోని పెర్నే గ్రామ సమీపంలో ఈ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలివస్తుండటంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో 5 వేల మంది పోలీసులు, 1200 మంది హోంగార్డులు, 12 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. అమరవీరుల స్థూపాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భీమా కోరేగావ్ యుద్ధం కథ..భీమా కోరేగావ్ యుద్ధం 1818 జనవరి 1న జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి, పీష్వాలకు మధ్య జరిగిన యుద్ధం అది. పుణెకు దగ్గరల్లోని కోరేగావ్లో బీమా నది చెంతన జరగడంతో ఆ పేరు వచ్చింది. 12 గంటల పాటు సాగిన యుద్ధంలో పీష్వాలు ఓడిపోయారు. వారి దళానికి చెందిన 600 మంది మరణించారు. పీష్వాలు బ్రాహ్మణులు. మహర్లను అంటరానివారిగా చూసే రోజులవి. బ్రిటిష్ సైన్యంలో మహర్లు కీలక పాత్ర పోషించారు. బ్రిటిషర్లపై బాజీరావ్ పోరాటంలో తమను కలుపుకోవాలన్న మహర్ల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించాడని, దీంతో వారు బ్రిటిషు సైన్యంలో చేరారని చెబుతారు.బ్రిటిషు విజయం... కుల వివక్షపై మహర్ల గెలుపు కూడా అయింది. కోరేగావ్-బీమాలో యుద్ధం జరిగిన చోట 1851లో 60 అడుగుల స్మారక స్థూపం నిర్మించారు. దానిపై యుద్ధంలో మరణించిన బొంబాయి నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన వారి పేర్లు రాయించారు. మొత్తం 49 పేర్లలో 29 పేర్లు మహర్లవి. 1927 నుంచి ప్రతి ఏటా జనవరి 1న మహర్లు ఆ స్థూపం వద్ద సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు.