మోదీ టీమ్‌లో మహిళా మంత్రులు వీరే..

Fri,May 31, 2019 10:52 AM

Only three woman cabinet ministers in Modi government

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఆరుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు కాగా, మరో ముగ్గురు సహాయ మంత్రులు. కేబినెట్ మంత్రులుగా నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, సహాయ మంత్రులుగా రేణుకా సింగ్ సరుతా, సాధ్వి నిరంజన్ జ్యోతి, దేబో శ్రీ చౌదరి ప్రమాణం చేశారు.

సేల్స్ విమెన్ టు మినిస్టర్
నిర్మలా సీతారామన్.. ఒకప్పుడు గృహాలంకరణ వస్తువుల దుకాణంలో పనిచేసిన ఆమె.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. తమిళనాడులోని మధురైలో 1959 ఆగస్టు 18న జన్మించారు. ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. 2016 నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభకు నామినేట్ అయిన నిర్మల.. మోదీ తాజా క్యాబినెట్‌లో మరోసారి బెర్త్‌ను దక్కించుకున్నారు. రక్షణమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన ఆమె..రాఫెల్ ఒప్పందంపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ధీటైన సమాధానం ఇస్తూ, ప్రధాని మోదీకి బలమైన సహకారాన్ని అందించారు.

స్మృతికి ఆకాశమే హద్దు..!
పట్టు విడువని తత్వమున్న స్మృతీ ఇరానీ బీజేపీలో అనూహ్యంగా ఎదిగారు. 2014లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేతిలో పరాజయం పాలైనప్పటికీ ఆయన మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగారు. ఓటమికి కుంగిపోకుండా గత ఐదేండ్లగా అమేథీలో విస్తృతంగా పర్యటించి పట్టును పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌పై గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. 2004లో తొలిసారి ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై పోటీచేసి ఓటమిచవిచూశారు. 2011, 17లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో మోదీ క్యాబినెట్‌లో చోటు సంపాదించిన పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందారు.

కౌర్.. వన్స్ మోర్
పంజాబ్‌లోని శిరోమణి అకాళీదల్ పార్టీకి మరోసారి కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించింది. ఆ పార్టీ అధ్యక్షుడైన సుఖ్‌భిర్‌సింగ్ బాదల్ భార్య, భటిండా ఎంపీ హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ రెండో సారి కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలో జన్మించిన ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందడమే కాకుండా టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా చేశారు. భటిండా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శిరోమణి అకాళీదల్ రెండు స్థానాల్లో గెలిచింది. ఆ రెండు స్థానాలు కూడా భార్యాభర్తలు గెలిచినవే కావడం విశేషం.

3096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles