విద్యార్థినులకు పురుషులు బోధించవద్దు

Sat,October 19, 2019 10:44 PM

జైపూర్, : రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏండ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఈవ్ టీజింగ్ (వేధించడం) కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా విలేకరులతో మాట్లాడుతూ బాలిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 50 ఏండ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువాలని నిర్ణయించినట్లు తెలిపారు. బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లనే నియమించడానికి ప్రాధాన్యం ఇస్తామని, ఒకవేళ వీరు సరిపోకపోతే 50 ఏండ్లకుపై వయస్సు ఉన్న పురుష ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని, అది వచ్చాక పరిస్థితిని బట్టి మహిళా టీచర్ల నియామకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.


మరోవైపు మంత్రి నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. యూనిసెఫ్ మాజీ పాలసీ ప్లానర్ కేబీ కొటారి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,019 బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏండ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుకకు పిలువడం చాలా సులభం. కానీ ఈ చర్య వల్ల దాదాపు 95 శాతం ఉన్న మిగతా పాఠశాలల్లోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు భయానికి లోనవుతారు. తాము వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని బాలికలు భయపడుతారు అని తెలిపారు. కాగా రాజస్థాన్‌లో 1,019 బాలికల పాఠశాలు ఉండగా, 68,910 కో-ఎడ్యుకేషన్ పాఠశాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3.82 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా పురుష, మహిళా టీచర్ల రేషియో 2:1గా ఉన్నది.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles