ఏ డీలూ లేదు.. పైలట్‌ను వెంటనే విడుదల చేయాల్సిందే: భారత్

Thu,February 28, 2019 02:54 PM

న్యూఢిల్లీ: తమకు చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌ను భారత్‌కు తిరిగి అప్పగించడానికి పాకిస్థాన్ ఏవేవో మెలికలు పెడుతున్నది. ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నది. అయితే ఈ డిమాండ్లకు భారత్ అంగీకరించడం లేదు. ఏ డీలూ లేదు.. వెంటనే మా పైలట్‌ను విడుదల చేయండి అని భారత్ స్పష్టం చేసింది. కాందహార్ సమయంలోలాగే ఇప్పుడూ భారత్‌పై పాకిస్థాన్ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని, అయితే దీనికి భారత్ తలొగ్గే పరిస్థితుల్లో లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి చర్చలు లేదా ఒప్పందాలకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, పఠాన్‌కోట్‌లపై దాడుల సమయంలోనూ పాకిస్థాన్‌కు పూర్తి ఆధారాలు ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈసారి అలాంటి ఆధారాలేవీ పాక్‌కు ఇచ్చే ప్రసక్తే లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.


గతంలో ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నాం. వాటికి సంబంధించిన ఆడియోలూ ఇచ్చాం. అయినా పాకిస్థాన్ మాత్రం నిరాకరిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పుల్వామాలో జైషే మహ్మద్ పాత్రను పాక్ అంగీకరించడం లేదు అని భారత్ అభిప్రాయపడింది. కర్తార్‌పూర్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ పాకిస్థాన్ ఆ చర్చలను రద్దు చేసింది. ఇప్పుడు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. విమానాలను, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసింది అని భారత్ ఆరోపించింది. జైషే మహ్మద్, ఇద్దరు పైలట్లు కస్టడీలో ఉన్నారన్న అంశాలపై అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. భారత్ నౌకలపై అబద్ధం చెప్పారు. మిస్సైల్ దాడులపై అబద్ధం చెప్పారు అని భారత్ విమర్శించింది.

5849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles