నెహ్రూ మెమోరియల్‌ను ఏం చేయబోతున్నారు?

Tue,August 28, 2018 06:35 PM

NEHRU MEMORIAL DIRECTOR DEFENDS MUSEUM PROJECT

భారత ప్రథమ ప్రధాని, నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ స్మారకమందిరం స్వరూపస్వభావాలను కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. నెహ్రూ అధికారనివాసమైన తీన్‌మూర్తిభవన్‌ను తదనంతరకాలంలో స్మారక కేంద్రంగా మార్చారు. ఇప్పడు దానిని కేవలం నెహ్రూకు మాత్రమే కాకుండా మాజీ ప్రధానులందరికీ వర్తింపజేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే స్మారక కేంద్రం స్వరూపస్వభావాలను మార్చరాదని, ఉన్నది ఉన్నట్టుగా వదిలెయ్యాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రధాని నరేంద్రమోదీకి గతవారం లేఖరాశారు. అయితే మార్పుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్మారకకేంద్రం డైరెక్టర్ శక్తిసిన్హా మాటలను బట్టి తెలుస్తున్నది. కాంగ్రెస్‌పై ఆయన ఎదురుదాడికి దిగారు. ఆ పార్టీ అభ్యంతరాల వెనుకనున్న ఉద్దేశాన్ని సిన్హా ప్రశ్నించారు. గతంలో స్మారకకేంద్రం స్థలాన్ని నెహ్రూతో సంబంధం లేని కార్యకలాపాలకు కేటాయించినప్పుడు నోరుమెదపని కాంగ్రెస్ ఇప్పుడే ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. తీన్‌మూర్తి ఎస్టేట్ బాగా కుంచించుకుపోయిందని, ఓ ప్లానెటేరియంకు, ఢిల్లీ పోలీసులకు కొంతరకొత స్థలాన్ని కేటాయించడాన్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ప్రతిపాదిత మ్యూజియం వల్ల నెహ్రూ స్మృతికి ఎలాంటి ఇబ్బంది కలుగదని వాదించారు.


నెహ్రూ ఓ క్రియాశీలమైన నేత అని, తీన్‌మూర్తిభవన్‌కు అలాంటి నివాసి మరొకరు లభించబోరని మరో మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను మన్మోహన్ తన లేఖలో ఉటంకించారు. స్మారక కేంద్రాన్ని మెరుగు ప్రచేందుకు తాము కృషి చేస్తుంటే మెచ్చుకునే బదులు విమర్శలు చేయడం ఏమిటని డైరెకటర్ సిన్హా మండిపడ్డారు. గత 50 ఏండ్లలో ఎందరో కాంగ్రెస్ ప్రధానులు కూడా వచ్చారని, అందరికీ కలిపి ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తే తప్పేమిటని నిలదీశారు. నెహ్రూ స్మారక కేంద్రం ఆవరణలో మాజీ ప్రధానుల మ్యూజియం ఏర్పాటు చేయాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని గతనెల జరిగిన 43వ వార్షిక సమావేశంలో 15 మంది సొసైటీ సభ్యులు సమర్థించగా ఆరుగురు సభ్యులు (కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, మల్లికార్జున ఖర్గే, కరణ్‌సింగ్, చరిత్రకారుడు నయన్‌జ్యోత్ లాహిరి, ఆర్థికవేత్త నితిన్ దేశాయ్, బీపీసింగ్) తీవ్రంగా వ్యతిరేకించారు. మ్యూజియం ప్రాజెక్టును మొదటినుంచి వ్యతిరేకిస్తున్న ఏజీకే మీనన్ (ఇంటాచ్) సమావేశాన్ని బహిష్కరించారు. వారసత్వ నిబంధనలను అది ఉల్లంఘిస్తున్నదని ఆయన అదివరకే బహిరంగంగా ప్రకటించారు.

1463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles